Monday, 13 April 2020

Srimadramayana Pravachanamruthadhara 52

Srimadramayana Pravachanamruthadhara -- 52 By Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu

సుగ్రీవుడు తార, రుమలతో హాయిగా, సంతోషముగా కాలం గడపసాగాడు.

బాలేంద్రగోపాంతర చిత్రితేన విభాతి భూమిర్నవశాద్వలేన |
గాత్రానువృత్తేన శుకప్రభేణ నారీవ లాక్షోక్షిత కంబళేన ||

వర్షాకాలాన్ని చూసి రాముడు " లక్ష్మణా ! ఈ వర్షాకాలములో వర్షములు విశేషముగా పడడము వలన భూమిమీద గడ్డి బాగా పెరిగి భూమి అంతా ఆకుపచ్చగా ఉన్నది.   భూమిమీద ఎర్రటి ఇంద్రగోప పురుగులు అక్కడక్కడ తిరుగుతున్నాయి. ఆ దృశ్యం భూదేవి ఎర్రటి చుక్కలు కలిగిన ఆకుపచ్చ చీర కట్టుకున్నదా! అన్నట్టుగా ఉన్నది. నదులన్నీ నీళ్ళతో ప్రవహిస్తున్నాయి. మేఘాలు కురుస్తున్నాయి. ఏనుగులు పెద్ద శబ్దములు చేస్తున్నాయి. వనములయొక్క మధ్య భాగములు ప్రకాశిస్తున్నాయి. భార్యలు పక్కన లేనివారు ధ్యానము  చేస్తున్నారు. వర్షం పడుతుంటే నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి. వానరములన్నీ చాలా సంతోషముగా ఉన్నాయి. ఆకాశములో వెళుతున్న మబ్బులు యుద్ధానికి వెళుతున్న రథములా ఉన్నాయి. మెరుపులు ఆ రథానికి కట్టిన పతాకములా ఉన్నాయి. మబ్బులు వస్తుంటే గాలికి దుమ్ము రేగిపోతున్నది. ఇవన్నీ చూస్తుంటే నాకు ఎప్పుడెప్పుడు రావణాసురుని మీద యుద్ధం చేద్దామాని పొంగిపోతున్నటువంటి వానరుల యొక్క శక్తి జ్ఞాపకము వస్తున్నది.

మార్గానుగః శైలవనానుసారీ సంప్రస్థితో మేఘరవం నిశమ్య |
యుద్ధాభికామః ప్రతినాదశంకీ మత్తో గజేంద్రః ప్రతిసన్నివృత్తః ||
ఒక పెద్ద మదగజము వర్షంలో తడుస్తూ హాయిగా పడుకొని ఉన్నది. ఇంతలో పిడుగు పడినట్టు ఒక మేఘం పెద్ద శబ్దం చేసింది. ఆ శబ్దాన్ని విన్న ఏనుగు ' ఆహా! ఇంకొక మదగజం కూడ ఎక్కడో అరుస్తున్నది దాని మదం అణిచేస్తాను ' అనుకొని తన తొండము పైకెత్తి పెద్దగా ఘీంకరిస్తూ ఆ శబ్దం వినపడ్డ వైపుకి బయలుదేరింది. కొంతదూరం వెళ్ళాక మళ్ళీ ఆ మేఘం శబ్దం చేసింది. ' ఓహో మేఘము ఉరుముతున్నది. మరొక మదగజము కాదన్నమాట ' అని తన తొండాన్ని దింపేసి మెల్లగా వెనక్కి నడుచుకుంటూ వచ్చి తాను ముందు పడుకున్న చోటనే పడుకున్నది. రంగురంగుల కప్పలు, తోకలున్న కప్పలు, పొడుగు కప్పలు అలా రకరకాల కప్పలు ఇప్పటిదాకా ఎక్కడున్నాయో కాని ఎప్పుడైతే మేఘంనుంచి పడిన వర్షధారలు ఈ కప్పలని కొట్టగానే ఆ కప్పలన్నీ బెకబెక అనే ఒకేరకమైన శబ్దం చేశాయి. ఈ వర్షములు పడే కాలములోనే సామవేదాన్ని నేర్చుకునేవారికి పాఠం ప్రారంభిస్తారు.

నిద్రా శనైః కేశవమభ్యుపైతి ద్రుతం నదీ సాగరమభ్యుపైతి |
హృష్టా బలాకా ఘనమభ్యుపైతి కాంతా సకామా ప్రియమభ్యుపైతి ||
నిద్ర మెల్లమెల్లగా కదిలి కేశవుడిని చేరుకుంటుంది. నది వేగముగా ప్రవహిస్తూ సాగరానికి వెళ్ళిపోతుంది. ఆకాశములో కొంగలు బారులు బారులుగా వెళ్ళిపోతున్నాయి. పతివ్రత అయిన కాంత ఈ ఋతువు యొక్క ప్రభావము చేత మెల్లమెల్లగా భర్త కౌగిటిలోకి చేరిపోతుంది. ఈ వర్షాకాలము ఎంతో గొప్పది. సుగ్రీవుడు చాలా కష్టాలు పడ్డాడు. అందుకని నేను విశ్రాంతి తీసుకోమని చెప్పాను. నాకు సుగ్రీవుడి మీద విశ్వాసం ఉన్నది. ఈ వర్షాకాలం వెళ్ళిపోయి కార్తీకమాసం వస్తుంది అప్పుడు వర్షం కురవదు. సుగ్రీవుడు మనకి తప్పకుండా ఉపకారము చేస్తాడు " అని అన్నాడు.
 వర్షాకాలం పూర్తయిపోయింది. కార్తీకమాసం మొదలయ్యింది. హనుమంతుడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి " సుగ్రీవా! నువ్వు రాముడి అనుగ్రహము చేత రాజ్యాన్ని పొందావు. నువ్వు మిత్రుడికి ప్రత్యుపకారము చెయ్యాలి. నాలుగు విషయాలలో రాజు ఎప్పుడూ కూడ అప్రమత్తుడై ఉండాలి. తన కోశాగారము ఎప్పుడూ నిండుగా ఉండాలి. తగినంత సైన్యం ఉండాలి. మిత్రులయందు పరాకుగా ఉండకూడదు. ప్రభుత్వాన్ని నడిపించడములో శక్తియుతంగా ఉండాలి. ఈ నాలుగు విషయాలలో రాజు చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలం గడిచిపోయింది. నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళాలి కాని నువ్వు వెళ్ళలేదు. నువ్వు వెళ్ళలేదు కనుక రాముడు నీకు జ్ఞాపకము చెయ్యాలి. రాముడు జ్ఞాపకము చేస్తే వేరొకలా ఉంటుంది. అలా జ్ఞాపకము చెయ్యకపోవడము రాముని యొక్క ఔదార్యం. పోనిలే అని రాముడు ఓర్మి వహించి ఉన్నాడు. ఆ ఓర్మి దాటిపోకముందే నీ అంతట నువ్వు వెళ్ళి రామ దర్శనము  చెయ్యడము మంచిది.

నువ్వు వానరములను దశదిశలకి వెళ్ళి సీతమ్మని అన్వేషించమని ఆదేశించు. ఈ మాట నువ్వు ముందు చెపితే నీ మర్యాద నిలబడుతుంది. రాముడు వచ్చి నా కార్యము ఎందుకు చెయ్యలేదు అని అడిగితే ఆనాడు నువ్వు ఈ మాట చెప్పినా నీ మర్యాద నిలబడదు. నువ్వు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. రాముడు నీకు రెండు ఉపకారములు చేశాడు. నీకు బలమైన శత్రువైన వాలిని సంహరించాడు. అదే సమయంలో నీకు రాజ్యం ఇచ్చాడు. మీరు అగ్నిసాక్షిగా స్నేహం చేసుకున్నప్పుడు ఆయన నీతో ' నేను నీకు ఉపకారము చేస్తాను. నువ్వు సీతని అన్వేషించి పెట్టు ' అన్నాడు. ఆయన నీకు చేసినంత ఉపకారము యదార్ధమునకు నీ నుంచి ఆశించలేదు. అన్నిదిక్కులకి వెళ్ళగలిగిన బలవంతులైన వానరములు నీ దగ్గర ఉన్నారు. వాళ్ళు వెళ్ళడానికి ఉత్సాహముతో ఉన్నారు. నీ ఆజ్ఞ లేదు కనుక వారు వెళ్ళలేదు. నువ్వు కామమునందు అతిశయించిన ప్రీతితో ఉన్నావు కనుక వారికి నీ ఆజ్ఞ లేదు. రాముడే దుఃఖపడి కోదండమును పట్టుకుంటే ఆయనని నిగ్రహించగలిగేవారు ఎవ్వరూ లేరు. అప్పుడు నీకే కాదు లోకానికి కూడ ప్రమాదము " అన్నాడు.

హనుమంతుడి మాటలని అర్ధం చేసుకున్న సుగ్రీవుడు వెంటనే నీలుడిని పిలిచి " నువ్వు వెంటనే వెళ్ళి ఈ పృధ్వీ మండలములో ఎక్కడెక్కడ వానరములు ఉన్నా, లాంగూలములు ఉన్నా, భల్లూకములు ఉన్నా, అన్నిటినీ కూడా వెంటనే చేరమని చెప్పు. ఇవన్నీ కూడా పదిహేను రోజుల లోపల ఇక్కడికి రావాలి. తరవాత ఏ వానరము ఇక్కడికి చేరుతుందో ఆ వానరము కుత్తుక కత్తిరించబడుతుంది. ఇది సుగ్రీవ ఆజ్ఞగా ప్రకటించు " అన్నాడు.

సుగ్రీవుడు చెప్పిన విధంగా అందరికీ ప్రకటించారు, సుగ్రీవుడు మళ్ళీ అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు.
కార్తీకమాసం వచ్చినా సుగ్రీవుడినుండి ఒక్కమాట కూడా రాకపోవడము చేత రాముడు లక్ష్మణుడిని పిలిచి " పరస్పర వైరం ఉన్న రాజులందరూ కూడా ఒకరిని ఒకరు దునుమాడుకోడానికి సైన్యముతో యుద్ధానికి వెళ్ళిపోయారు. ఆకాశము అంతా నిర్మలముగా అయిపోయింది. నీటి ప్రవాహములన్నీ పరిశుద్ధము అయ్యాయి. నేల మీద ఉండే బురద ఇంకిపోయింది. చంద్రుడు విశేషమైన వెన్నెల కురిపిస్తున్నాడు. శరత్ ఋతువు వచ్చేసింది. కాని సుగ్రీవుడికి మాత్రము ఈ కాలం వచ్చినట్టుగా లేదు. ఏ ప్రయత్నాన్ని సుగ్రీవుడు ఈ కాలం వచ్చిన తరువాత చెయ్యాలో ఆ ప్రయత్నాన్ని చేసినవాడిగా కనపడడము లేదు.

లక్ష్మణా! సుగ్రీవుడు ఎందుకు ఉపకారము చెయ్యడము లేదో ఈ గుహ దగ్గరికి ఎందుకు రావడములేదో నాతో ఎందుకు మాట్లాడడము లేదో తెలుసా?
ప్రియావిహీనే దుఃఖార్తే హృతరాజ్యే వివాసితే |
కృపాం న కురుతే రాజా సుగ్రీవో మయి లక్ష్మణ ||
నాకు ప్రియమైన భార్యని రాక్షసుడు ఎత్తుకుపోయాడు. అపారమైన దుఃఖముతో ఉన్నాను.   రాజ్యము పోయింది. అటువంటి దీనుడిని కదా, ఇవ్వాళ నా దగ్గర ఏముంది? గుహలో పడుకొని ఉన్నాను కదా! అందుకని సుగ్రీవుడికి నా మీద కృపలేదు. నన్ను రక్షిస్తానని అన్న సంగతి మరిచిపోయాడు. నేను ఇప్పుడు అనాథని రావణుడేమో నన్ను అవమానించాడు. దీనుడిని ఇంటికి చాలా దూరముగా ఉన్నాను. నేను నా భార్యని పొందాలనే స్థితిలో ఉండి సుగ్రీవుడిని శరణాగతి చేశాను. అయినా సుగ్రీవుడు నాకు ఉపకారం చెయ్యడము లేదు.

ఈ కారణాల వల్లే సుగ్రీవుడు నన్ను ఇంత చిన్న చూపు చూస్తున్నాడు. నాకు ఏమిచెయ్యాలో తెలుసు. చేసుకున్న ఒడంబడిక మరిచిపోయాడు. సీతని ఎలాగైనా అన్వేషిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు తన భార్యలతో కామసుఖాన్ని అనుభవిస్తున్నాడు.

అర్థినాముపపన్నానాం పూర్వం చాప్యుపకారిణామ్  |
ఆశాం సంశ్రుత్య యో హంతి స లోకే పురుషాధమః ||
ఎవడైతే చేసిన ఉపకారాన్ని మరిచిపోయి తిరిగి ప్రత్యుపకారమును చెయ్యడో వాడు పురుషాధముడు అని శాస్త్రం చెబుతుంది. ఒకమాట నోటివెంట వస్తే ఆ మాటకి  కట్టుబడిపోయిన వాడిని పురుషోత్తముడు అంటారు. తమ పనులు పూర్తి చేసుకొని తన మిత్రులకి అక్కరకు రాకుండా జీవితాన్ని గడుపుకుంటున్నవాడి యొక్క శరీరము పడిపోయిన తరువాత కుక్కలు కూడా వాడి శరీరాన్ని తినడానికి ఇష్టపడవు. ఇవ్వాళ సుగ్రీవుడు అటువంటి కృతఘ్నతా భావంతో ప్రవర్తిస్తున్నాడు. నేను కోదండాన్ని పట్టుకొని వేసే బాణముల యొక్క మెరుపులని చూడాలని నా వింటినారి యొక్క ధ్వనిని వినాలని అనుకుంటున్నట్టుగా ఉన్నాడు. రాముడికి కోపం వచ్చి యుద్ధ భూమిలో నిలబడిననాడు రాముడి స్వరూపము ఎలా ఉంటుందో మరిచిపోయినట్టున్నాడు. లక్ష్మణా! నువ్వు ఒకసారి కిష్కిందకి వెళ్ళి ' సుగ్రీవా ! మా అన్నగారు కోపము వచ్చి కోదండము పట్టుకొని బాణములు విడిచిపెడుతున్నప్పుడు ఆయన యొక్క రూపము చూడాలని అనుకుంటున్నావా? ' అని అడుగు.

నచసంకుచితః పంథా యేన వాలీ హతో గతః |
సమయే తిష్ఠ సుగ్రీవ మావాలి పథమన్వగాః ||
అలాగే నేను చెప్పానని ఈ మాట కూడా చెప్పు ' వాలి ఏ దారిలో వెళ్ళిపోయాడో ఆ దారి ఇంకా మూసేయ్యలేదని చెప్పు. చేసుకున్న ఒప్పందమునకు కట్టుబడి ఉండమని చెప్పు. లేకపోతే  నీ అన్న వెళ్ళిన దారిలో నిన్ను పంపడానికి మా అన్నయ్య సిద్ధపడుతున్నాడు ' అని చెప్పు. ఆనాడు ధర్మము తప్పిన వాలిని ఒక్కడినే ఒకే బాణముతో చంపాను, ఈనాడు సుగ్రీవుడు ధర్మం తప్పినందుకు ఒక బాణముతో సపరివారంగా అందరినీ పంపించేస్తానని చెప్పు " అని  అన్నాడు.

  లక్ష్మణుడు " ఎందుకన్నయ్యా అన్ని మాటలు? వాడు రాజ్యం పరిపాలించడానికి అనర్హుడు. నీ వల్ల ఉపకారము చేయించుకొని రాజ్యం పొందాడు. ఇప్పుడే వెళ్ళి సుగ్రీవుడిని చంపేస్తాను.   ఇంక నేను నా కోపాన్ని ఆపుకోలేను. నీదాకా ఎందుకు నేనే సుగ్రీవుడిని చంపేస్తాను. సుగ్రీవుడిని చంపేసి అంగదుడికి పట్టాభిషేకము చేస్తాను. అంగదుడు వెంటనే సైన్యాన్ని పంపించి సీతమ్మని అన్వేషిస్తాడు. సుగ్రీవుడి యొక్క తప్పిదము తలుచుకుంటుంటే, నీ బాధ తలుచుకుంటుంటే నాకు ఇంకా ఇంకా కోపం వస్తున్నది నేను ఇప్పుడే బయలుదేరి వెళతాను " అన్నాడు.

ఒకవేళ లక్ష్మణుడు నిజంగానే సుగ్రీవుడిని చంపెస్తాడేమో అని రాముడు శాంతించి లక్ష్మణుడితో " లక్ష్మణా! మనం ఇంతకముందు సుగ్రీవుడితో చేసుకున్న స్నేహం జ్ఞాపకము  పెట్టుకో. ఆ స్నేహాన్ని జ్ఞాపకము పెట్టుకొని సుగ్రీవుడు ఎక్కడ దారి తప్పాడో ఆ తప్పిన దారి నుండి మంచి దారిలోకి మళ్ళించు. అంతేకాని చంపేస్తాను అని అమంగళకరమైన మాటలు మాట్లాడకు" అని చెప్పాడు.

రాముడు అన్ని మాటలు చెప్పినా కాని లక్ష్మణుడి మనసులో కోపం తగ్గలేదు. ఇవ్వాళ మా అన్నయ్యకి సుగ్రీవుడు ఇంత కోపం తెప్పించాడు అనుకొని ఆగ్రహంతో కిష్కిందా నగరము  వైపు అడ్డదారి గుండా బయలుదేరాడు. లక్ష్మణుడు వెళుతున్న దారిలో ఒక చెట్టు యొక్క కొమ్మ దారికి అడ్డంగా ఉంది, ' నేను వెళుతున్న దారికి అడ్డం వస్తావా ' అని ఆ చెట్టుని పెకలించి అవతలపడేసాడు. ఆయన దారిలో అడ్డువచ్చిన వృక్షాలని, రాళ్ళని పెకలిస్తూ, ముక్కలు చేస్తూ ముందుకి వెళ్ళాడు. అలా వేగంగా వస్తున్న లక్ష్మణుడిని చూసి కొంతమంది వానరములు చెల్లాచెదురై పారిపోయారు. లక్ష్మణుడు యుద్ధానికి వస్తున్నాడని తలచి కొంతమంది మహానాదం చేశారు. ఆ సమయానికి సుగ్రీవుడు అంతఃపురంలో తారతో, రుమతో, వానరకాంతలతో విశేషమైన మధుపానం చేసి హారములన్నీ చెదిరిపోయి కామభోగమునందు రమిస్తూ ఉన్నాడు.

 లక్ష్మణుడు అక్కడే బయట ఉన్న అంగదుడితో " నువ్వు లోపలికి వెళ్ళి నీ పినతండ్రి అయిన సుగ్రీవుడితో ఒక మాట చెప్పు. ' రాముడు శోకంతో ఉన్నాడు. రాముడి మాటలు చెప్పడం కోసం ఆయన తమ్ముడైన లక్ష్మణుడు వచ్చి ద్వారం వద్ద ఎదురు చూస్తున్నాడు. ఆయన నీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు '. ఈ మాటలని లోపలికి వెళ్ళి నీ పినతండ్రితో చెప్పి ఆయన ఏమనుకుంటున్నాడో వచ్చి నాతో చెప్పు " అన్నాడు. అంగదుడితో పాటు ప్లక్షుడు, ప్రభావుడు అనే ఇద్దరు మంత్రులు కూడా వెళ్ళారు. అంగదుడు లోపలికి వెళ్ళి సుగ్రీవుడికి, తారకి, రుమకి పాదాభివందనము చేసి లక్ష్మణుడు చెప్పిన మాటలని సుగ్రీవుడికి చెప్పాడు. బాగా మత్తులో ఉండడము వలన అంగదుడు చెప్పిన మాటలు సుగ్రీవుడి మనస్సులోకి వెళ్ళలేదు.

   లక్ష్మణుడిని చూసి భయ భ్రాంతులకి గురైన మిగిలిన వానరములు ఒక పెద్ద నాదం చేశాయి. ఆ నాదానికి సుగ్రీవుడు ఉలిక్కి పడి అక్కడే ఉన్న మంత్రులని పిలిచి " ఆ వానరాలు ఎందుకు అలా అరుస్తున్నారు? " అని అడిగాడు. అప్పుడు వాళ్ళు కూడా లక్ష్మణుడు చెప్పిన మాటలని చెప్పారు. ఆ మాటలు విన్న సుగ్రీవుడు " నేను రాముని పట్ల ఎటువంటి అపచారము చెయ్యలేదు. బహుశా రాముడితో నా స్నేహాన్ని చెడగొట్టడానికి నేనంటే గిట్టనివాళ్ళు రామలక్ష్మణులకి చాడీలు చెప్పి ఉంటారు. నాగురించి ఎవరో అలా చెబితే రామలక్ష్మణులు నమ్మకూడదు వాళ్ళకి ఇంత ఆగ్రహం ఎందుకు వచ్చింది? స్నేహం చెయ్యడం తేలిక. స్నేహాన్ని నిలుపుకోవడము చాలా కష్టం. రాముడు నాకు చేసిన మేలుని నేను ఎన్నడూ మరువను, రాముడికి సహాయము చెయ్యకపోవడము నా తప్పే " అన్నాడు.

సర్వథా ప్రణయాత్ క్రుద్ధో రాఘవో నాఽత్ర సంశయః |
భ్రాతరం సంప్రహితవాన్ లక్ష్మణం లక్ష్మి వర్ధనమ్  ||
 హనుమంతుడు అన్నాడు " సుగ్రీవా! నీకు ఇంకా బోధపడలేదు. నీయందు రాముడికి ఉన్నది ప్రతీకారేచ్ఛ కోపం కాదు. ఆయనకి నీయందున్నది ప్రేమతో కూడిన కోపం. నువ్వు నీ భార్యలతో ఉన్నావు. రాజ్యాన్ని పొందావు వేళ దాటిపోయినా సుఖాలు అనుభవిస్తున్నావు. రాముడికి భార్య లేదు రాజ్యం లేదు. నీకు ఉపకారం చేశాడు నీకు సమయం ఇచ్చాడు. నగరానికి కూడా రాకుండా బయట ఒక గుహలో పడుకుంటున్నాడు. ఇంతకాలం ఎదురు చూశాడు, నీ నుండి సహకారము లభించకపోవడము వలన బాధపడ్డాడు. ఆ బాధలోనుండి వచ్చే మాట నువ్వు వినడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. నువ్వు వినడానికి కష్టంగా ఉందని కాదు వినవలసింది అవతలివాడి కష్టం ఎంత ఉంటే ఆ మాట వచ్చిందో నువ్వు గమనించాలి. నువ్వు బాగా తప్పతాగి ఉన్నావు కాబట్టి ' రాముడు నన్ను ఇంతమాట అంటాడ ' ని అనవద్దు. లక్ష్మణుడు కోపంగా మాట్లాడితే అంజలి ఘటించి విను తప్ప కోపగించుకోవద్దు " అన్నాడు.

బయట లక్ష్మణుడు నిలబడి ఉండగా, లోపలినుండి స్త్రీల ఆభరణముల, కంకణముల, వడ్డాణముల శబ్దములు వినపడ్డాయి. లక్ష్మణుడు సిగ్గుపడి లోపలికి వెళ్ళలేదు, కాని లోపలినుండి వస్తున్న కోపాన్ని ఆపుకోలేక ఒక్కసారి తన వింటినారి యొక్క ఠంకార ధ్వని చేశాడు. పిడుగు పడినట్టు వచ్చిన ఆ శబ్దానికి లోపల భార్యలతో పడుకుని ఉన్న సుగ్రీవుడు ఒక్కసారి ఎగిరి గంతేసి ఓ ఆసనములో కూర్చున్నాడు. ఆ సమయంలో సుగ్రీవుడి ఒంటిమీద ఉన్న ఆభరణాలు అటుఇటు తొలిగిపోయాయి. ఒక కోతి తన పిల్లని పట్టుకున్నట్టు సుగ్రీవుడు రుమని తన ఒళ్లో పెట్టుకొని ఆసనములో కూర్చున్నాడు. పైకి నిలబడలేక అటుఇటు తూలుతున్న సుగ్రీవుడికి వెంటనే వాలి చెప్పిన మాట గుర్తుకు వచ్చి తారని పిలిచాడు.

సుగ్రీవుడు తారతో " తార! ఇప్పుడు లక్ష్మణుడితో మాట్లాడగలిగినదానివి నువ్వు ఒక్కదానివే. ఎలాగోలా నువ్వే బయటకి వెళ్ళి లక్ష్మణుడితో మాట్లాడు. లక్ష్మణుడు ఎప్పుడూ ధర్మం తప్పడు. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే బయటకి వెళ్ళు ( ఆ సమయంలో తార కూడా మద్యం సేవించి తూలుతూ ఉన్నది. ఆమె ఒంటిమీద బట్ట కూడా సరిగ్గా లేదు. ఆభరణాలు సరిగ్గా లేవు ). నిన్ను అలా చూడగానే అంత కోపంతో ఉన్న లక్ష్మణుడు కూడా తల దించేసుకుంటాడు. ఎందుకంటే స్త్రీలతో అమర్యాదగా మాట్లాడడము కాని, స్త్రీతో గట్టిగా మాట్లాడడము కాని, స్త్రీ జోలికి వెళ్ళడము కాని ఇక్ష్వాకువంశీయులు చెయ్యరు. నువ్వు నీ మాటలతో లక్ష్మణుడిని ప్రసన్నుడిని చెయ్యి. అప్పుడు నేను మెల్లగా బయటకి వస్తాను " అన్నాడు.

సుగ్రీవుడి చేత అనుభవించిన సుఖం వల్ల, తాగిన మద్యం వల్ల తార కనుగుడ్లు ఎర్రగా అయ్యి తిరుగుడుపడుతున్నాయి. ఒక చోట స్థిరంగా నిలబడలేక అటుఇటు తూలిపోతున్నది. ఆమె వేసుకున్న వడ్డాణం కిందకి జారిపోయింది. పైకి కనపడకూడని హారాలు పైకి కనపడుతూ జారిపోయి ఉన్నాయి. ఒంటి మీద బట్టకూడా జారిపోయింది. లక్ష్మణుడి కోపం తగ్గించడానికి అలా ఉన్న తార బయటకి వచ్చి లక్ష్మణుడికి కనపడింది.

స తాం సమీక్ష్యైవ హరీశ పత్నీం తస్థావుదాసీనతయా మహాత్మా |
అవాఙ్ముఖోఽభూన్మనుజేంద్రపుత్తః  స్త్రీసన్నికర్షాద్వినివృత్త కోపః  ||
ఎప్పుడైతే తన దగ్గరికి ఆ సుగ్రీవుడి భార్య అటువంటి స్వరూపముతో వచ్చిందో పదునాలుగు  సంవత్సరముల నుండి భార్యకి దూరముగా యవ్వనములో ఉన్న లక్ష్మణుడు కోపంతో ఉన్న లక్ష్మణుడు ఏ భావము లేనివాడిగా నిలబడ్డాడు. అప్పటివరకూ కోపంతో బుసలు కొడుతూ ఉన్న లక్ష్మణుడు ఆమెని చూడగానే భూమివంక చూస్తూ ఆమెతో మాట్లాడవలసి వస్తుందేమో అని వెంటనే తన కోపాన్ని విడిచిపెట్టేసాడు.

Sunday, 12 April 2020

Today's Thidi Details

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
ఏప్రిల్ 13 , 2020
శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్ర మాసం బహుళ పక్షం
తిధి:షష్ఠి రా9.42 తదుపరి సప్తమి 
వారం:సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం :మూల రా12.08 తదుపరి పూర్వాషాడ
యోగం:పరిఘము రా12.02 తదుపరి శివం
కరణం:గరజి ఉ10.14 తదుపరి వణిజ రా9.42 ఆ తదుపరి భద్ర/విష్ఠి  
వర్జ్యం :ఉ8.21 - 9.56 & రా10.34 - 12.08
దుర్ముహూర్తం:మ12.24 - 1.14 &
మ2.53 - 3.42
అమృతకాలం  :సా5.49 - 7.24
రాహుకాలం :ఉ7.30 - 9.00
యమగండం/కేతుకాలం:ఉ10.30 - 12.00
సూర్యరాశి :మీనం
చంద్రరాశి   :వృశ్చికం
సూర్యోదయం      :5.49
సూర్యాస్తమయం :6.11
మేష సంక్రమణం ప్రారంభం
సర్వే జనాః సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

Srimadramayana Pravachanamruthadhara -- 51

Srimadramayana Pravachanamruthadhara -- 51 By Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu

న త్వాత్మానమ్ అహం శోచే న తారాం న చ  బాంధవాన్ |
యథా పుత్రం గుణశ్రేష్ఠమ్  అంగదం కనకాంగదమ్  ||

కిందపడిపోయిన వాలి " రామా ! నేను నా ప్రాణములు పోతున్నాయని బాధపడడం లేదు. తార గురించి విలపించడము లేదు. కాని నా ప్రియాతిప్రియమైన కుమారుడు అంగదుడు సుఖాలకి అలవాటుపడి బతికినవాడు ఈ ఒక్క కొడుకు భవిష్యత్తు ఏమవుతుందా ! అని బెంగపడుతున్నాను. నా కొడుకు యొక్క శ్రేయస్సుని, అభివృద్ధిని నువ్వే సర్వకాలముల యందు చూడాలి " అన్నాడు.
రాముడు " దండించవలసిన నేరము ఏదన్నా ఒకటి చేయబడినప్పుడు ఆ దండనని అవతలి వ్యక్తి ప్రభుత్వం నుంచి కాని, రాజు నుండి కాని పొందితే వాడి పాపం అక్కడితో పోతుంది. ఒకవేళ దండన పొందకపోతే ఆ పాపం ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధముగా ఉంటుంది. వాలి నువ్వు అదృష్టవంతుడివి. నువ్వు చేసిన మహా పాపానికి శిక్ష అనుభవించిప్పుడే నీయందు ఉన్న దోషము  పోయింది. నువ్వు శరీరాన్ని విడిచిపెట్టాక స్వర్గలోకాన్ని పొందడానికి నీకెటువంటి ప్రతిబంధకము ఉండదు.  అంగదుడు నిన్ను ఎలా చూసేవాడో నీ తరవాత సుగ్రీవుడియందు, నాయందు అలాగే ఉంటాడు. పినతండ్రివల్ల నీ కుమారుడికి సమస్య వస్తుందని అనుకోవద్దు. నీ బిడ్డని తండ్రిగా కాపాడడానికి నేను ఉన్నాను " అన్నాడు.
 వాలి కిందపడిపోయి ఉండడం వల్ల చుట్టూ ఉన్న వానరాలు పరుగులు తీశాయి. జరుగుతున్న ఈ గందరగోళం విన్న తార బయటకి వచ్చి " మీరందరూ ఇలా ఎందుకు పరిగెడుతున్నారు?  " అని అడిగింది.

  వానరములు " రాముడికి, వాలికి యుద్ధం జరిగింది. వాలి పెద్ద పెద్ద చెట్లని, పర్వతాలని తీసుకొచ్చి రాముడి మీదకి విసిరాడు. ఇంద్రుడి చేతిలో ఉన్న వజ్రాయుధమువంటి బాణములతో రాముడు ఆ చెట్లని, పర్వతాలని కొట్టేసాడు. ఆ యుద్ధంలో ఆఖరున రాముడు వాలిమీద బాణమేసి కొట్టాడు. నీ కొడుకుని రక్షించుకో పారిపో " అన్నారు.
( ఇదే లోకం యొక్క పోకడ గొంతు మారుతున్న కొద్దీ నిజం అంతర్ధానమవుతుంది. )

 తార " భర్తపోయిన తరువాత నాకెందుకు ఈ రాజ్యము, ఈ కొడుకు " అని వాలి దగ్గరికి పరిగెత్తి వాలితో " నేను నీకు చెప్పిన మాటలు నువ్వు వినక ఈ పరిస్థితిని తెచ్చుకున్నావు. సుగ్రీవుడి భార్యని అపహరించి తెచ్చావు. కామమునకు లొంగావు " అని చెప్పి కొన ఊపిరితో ఉన్న వాలిని చూసి విలపించింది. తండ్రి మరణిస్తున్నాడని అంగదుడు నేల మీద పడి భోరున ఏడుస్తున్నాడు.

వాలి సుగ్రీవుడితో " సుగ్రీవా! నా దోషాలని లెక్కపెట్టకు. కాలం బలవత్తరమైన స్వరూపముతో తన ఫలితాన్ని ఇవ్వడానికి నా బుద్ధిని మొహపెట్టి నీతో నాకు వైరం వచ్చేటట్టు చేసింది. ఈ ఫలితాన్ని అనుభవించడము  కోసమని నీ నుండి నన్ను దూరం చేసింది. అన్నదమ్ములమైన మనిద్దరము కలిసి ఏకాకాలమునందు సుఖం అనుభవించేటట్టు భగవంతుడు రాయలేదు.  నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమయ్యింది. నీకు ఒక్క మాట చెపుతాను ఇది మాత్రం జాగ్రత్తగా విను. అంగదుడు నాకు ఒక్కడే కొడుకు. వాడు ఇవ్వాళ నాకోసం భూమి మీద పడి కొట్టుకుంటున్నాడు. వాడు సుఖములలో పెరిగాడు.  కష్టాలు తెలియవు. నేను వెళ్ళిపోయాక వాడికి సుఖాలు ఉండవు. నీ దగ్గర, పిన్ని దగ్గర ఎలా ఉండాలో వాడికి తెలియదు. తార బ్రతుకుతుందో లేదో నాకు తెలియదు. నా కొడుకుని జాగ్రత్తగా చూడు. వాడికి నువ్వే రక్షకుడివి. తారకి ఒక గొప్ప శక్తి ఉన్నది. ఎప్పుడైనా ఒక గొప్ప ఉత్పాతము వస్తే అప్పుడు మనం ఏమిచెయ్యాలో నిర్ణయించుకోలేని స్థితిలో  సూక్ష్మ బుద్ధితో ఆలోచించి చెప్పగలిగిన ప్రజ్ఞ తార సొత్తు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఏర్పడితే తార సహాయము తీసుకో. నువ్వు ఎప్పుడైనా కాని రాముడిని అవమానించినా రాముడి పని చెయ్యడములో ఆలస్యము చేసినా నేను వెళ్ళిన మార్గములో నువ్వు కూడా వచ్చేస్తావు జాగ్రత్తగా ఉండు.

నాయనా ! నా తండ్రయిన మహేంద్రుడు ఇచ్చిన మాల నా మెడలో ఉన్నది. నా ప్రాణం  వెళ్ళిపోతే ఈ శరీరము  శవం అయిపోతుంది. అప్పుడీ మాల అపవిత్రమవుతుంది. ఈ మాల జయాన్ని తీసుకొస్తుంది అందుకని నీకు ఇస్తున్నాను తీసుకో " అని ఆ మాలని సుగ్రీవుడికి ఇచ్చి ప్రాణములను వదిలేశాడు.

తార" ఎప్పుడూ నీ నోటివెంట ఒక మాట వచ్చేది. ' సుగ్రీవుడా! వాడిని చితక్కొట్టేస్తాను ' అనేవాడివి చూసావా! విధి ఎలా ఉంటుందో ఇవ్వాళ ఆ సుగ్రీవుడు నిన్ను కొట్టేశాడు. ఒంట్లో బలం ఉందని లేచింది మొదలు సంధ్యావందనానికి నాలుగు సముద్రాలు దూకావు. ఇంటికొచ్చి మళ్ళీ  ఎవరినో కొట్టడానికి వెళ్ళేవాడివి. నీతో యుద్ధం చేసిన ఎందరో వీరులని ఇలా భూమి మీద పడుకోపెట్టావు. ఇవ్వాళ నువ్వు కూడా అలా పడుకున్నావు. శూరుడన్న వాడికి పిల్లని ఇస్తే, ఆమెకి హఠాత్తుగా వైధవ్యం వస్తుంది. అందుకని శూరుడికి ఎవరూ పిల్లని ఇవ్వద్దు.
పతిహీనా తు యా నారీ కామం భవతు పుత్రిణీ |
ధన ధాన్యైః సంపూర్ణాఽపి విధవేత్యుచ్యతే జనైః ||
మాటవినే కొడుకులు ఎంతమంది ఉన్నా అపారమైన ఐశ్వర్యము ఉన్నా నేను గొప్ప పండితురాలినైనా నువ్వు వెళ్ళిపోవడము వల్ల లోకం నన్ను చూడగానే మాత్రం విధవ అనే అంటుంది " అన్నది.

 సుగ్రీవుడు రాముడితో " నువ్వు చేసిన ప్రతిజ్ఞకి అనుగుణముగా వాలిని సంహరించావు. అన్నని చంపమని నేను నిన్ను అడిగాను. నేను దుర్మార్గుడిని. ఇప్పుడు నాకు తెలుస్తుంది నేను ఎంత అకృత్యం చేశానో అని. అన్నయ్య బతికి ఉన్నంతకాలం అన్నయ్య పెట్టిన కష్టాలు తట్టుకోలేక అన్నయ్య పొతే బాగుండు పొతే బాగుండు అని నిన్ను తీసుకొచ్చి బాణం వెయ్యమన్నాను. అన్నయ్య భూమి మీద పడిపోయాక అన్నయ్య అంటే ఏమిటో నాకు అర్ధం అవుతున్నది.

నేను వాలి మీదకి యుద్ధానికి వెళితే నన్ను కొట్టి ఇంకొక్క గుద్దు గుద్దితే నేను చచ్చిపోతాను అన్నంతగా అలిసిపోయాక ' ఇంకెప్పుడూ ఇలాంటి పని చెయ్యకే, పో ' అని వెళ్ళిపోయేవాడు. కాని నన్ను చంపేవాడు కాదు. ఒకతల్లి బిడ్డలమని నన్ను ఎన్నడూ వాలి చంపలేదు. నేను చచ్చిపోతానని వాలి నన్ను అన్నిసార్లు వదిలేశాడు. నేను వాలిని చంపించేసాను. నీతో వాలిని చంపమని చెప్పినప్పుడు నాకు ఈ బాధ తెలియలేదు. జరిగినప్పుడు తెలుస్తుంది. అందుకని నాకు ఈ రాజ్యం వద్దు.

పెద్ద చెట్టు కొమ్మని విరిచి తీసుకొచ్చి దానితో నన్ను కొట్టి ఇంక నేను ఆ దెబ్బలు తట్టుకోలేక పడిపోతే,  ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు పనులు చెయ్యకు పో ' అనేవాడు. ఇవ్వాళ నన్ను అలా అనే అన్నయ్య ఎక్కడినుంచి వస్తాడు? ఇక నేను ఉండను. నేను అగ్నిలోకి వెళ్ళిపోతాను. రామా ! మిగిలిన ఈ వానరులు నీకు సీతాన్వేషణలో సహాయం చేస్తారు " అన్నాడు.

సుగ్రీవుడు అలా ఏడుస్తుంటే చూడలేక రాముడు ఏడిచాడు. తార వాలిని కౌగలించుకొని ఏడుద్దామంటే రాముడి బాణం వాలి గుండెలకి గుచ్చుకొని ఉన్నది.  నలుడు వచ్చి ఆ బాణాన్ని తీసేసాడు. తార భర్త యొక్క శరీరం దగ్గర ఏడిచి రాముడి దగ్గరికి వచ్చి " రామా ! నీగురించి ఊహించడం ఎవరి శక్యం కాదు. నువ్వు అపారమైన కీర్తికి నిలయమైన వాడివి. భూమికి ఎంత ఓర్పు ఉన్నదో నీకు అంత ఓర్పు ఉన్నది. నువ్వు విశాలమైన నేత్రములు కలిగినటువంటివాడివి. నీ చేతిలో పట్టుకున్న కోదండము నీ అవయవముల అందమైన పొందిక దానిలో ఉన్న కాంతి చూసిన తరువాత నువ్వు అందరివంటి మనుష్యుడవి కావని నేను గుర్తించాను. ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప దానం, భార్యా దానం. నేను లేకపోతే  వాలి అక్కడ కూడా సంతోషాన్ని పొందలేడు. అందుకని వాలిని ఏ బాణంతో కొట్టావో నన్ను కూడా ఆ బాణంతో కొట్టు. నేనూ వాలి దగ్గరికి వెళ్ళిపోతాను " అన్నది.
 రాముడు " నువ్వు అలా శోకించకూడదమ్మా కాలం అనేది ఒక బలమైన స్వరూపము. అది పుణ్యపాపాలకి ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ వాలి శరీరం ఇలా పడి ఉండగా మీరందరు ఇలా మాట్లాడకూడదు. జరగవలసిన క్రతువుని చూడండి " అన్నాడు.

వాలి శరీరాన్ని అగ్నికి ఆహుతి చేశారు.

తదనంతరం సుగ్రీవుడు, హనుమంతుడు మొదలైన వానరములు రాముడి దగ్గర కూర్చున్నారు.  హనుమంతుడు " ఇంతగొప్ప రాజ్యాన్ని సుగ్రీవుడు పొందేట్టుగా నువ్వు అనుగ్రహించావు.  నువ్వు ఒక్కసారి కిష్కిందా నగరానికి వస్తే నీకు అనేకమైన రత్నములను బహూకరించి నీ పాదములకు నమస్కరించి సుగ్రీవుడు కృతకృత్యుడు అవుతాడు " అని అన్నాడు.
రాముడు " పదునాలుగు  సంవత్సరములు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారము  అరణ్యములో ఉంటాను. నేను గ్రామంలో కాని, నగరంలో కాని ప్రవేశించి నిద్రపోను. పెద్దవాడైన వాలి యొక్క కొడుకైన అంగదుడు యోగ్యుడు. మీరు అతనికి యువరాజ పట్టాభిషేకము, సుగ్రీవుడికి రాజ్య పట్టాభిషేకము  చెయ్యండి. మీరందరు సంతోషముగా కిష్కిందలో ఉండండి. ఈ వర్షాకాలములో రావణుడిని వెతుకుతూ వెళ్ళడము కష్టం. సుగ్రీవా! పట్టాభిషేకము చేసుకొని నాలుగు నెలలు యదేచ్ఛగా సుఖాలు అనుభవించు. కొండల మీద తిరిగి ఎన్నాళ్ళ నుంచో  కష్టపడ్డావు. కార్తీకమాసం వచినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. అంతవరకు నేను ఊరి బయట ప్రస్రవణ పర్వత గుహలో ఉంటాను " అని చెప్పి సుగ్రీవుడిని పంపించాడు.

కిష్కిందకి వెళ్ళాక సుగ్రీవుడికి పట్టాభిషేకము  చేశారు. సుగ్రీవుడు మళ్ళీ  తారని పొందాడు. అలా తార, రుమలతో బయట వర్షాలు పడుతుండగా సుగ్రీవుడు ఆనందముగా కాలం గడపసాగాడు.

Saturday, 11 April 2020

Today thidi details

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
ఏప్రిల్ 12, 2020
శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్ర మాసం బహుళ పక్షం
తిధి: పంచమి రా10.47 తదుపరి షష్ఠి 
వారం :ఆదివారం (భానువాసరే)
నక్షత్రం:జ్యేష్ఠ రా12.29తదుపరి మూల
యోగం:వరీయాన్ రా1.57 తదుపరి పరిఘము
కరణం:కౌలువ ఉ11.31 తదుపరి తైతుల రా10.47 ఆ తదుపరి గరజి 
వర్జ్యం  :ఉ6.38 - 8.11
దుర్ముహూర్తం  :సా4.31 - 5.20
అమృతకాలం  :మ3.57 - 5.30
రాహుకాలం     :సా4.30 - 6.00
యమగండం/కేతుకాలం:మ12.00 - 1.30
సూర్యరాశి : మీనం
చంద్రరాశి   :   వృశ్చికం
సూర్యోదయం      : 5.49
సూర్యాస్తమయం : 6.10
సర్వే జనాః సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

Friday, 10 April 2020

Srimadramayana Pravachanamruthadhara -- 50

Srimadramayana Pravachanamruthadhara -- 50 By Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu

  సుగ్రీవుడు " రామా ! నేను ఇలా అంటున్నానని ఏమి అనుకోవద్దు. మా వాలి పౌరుష పరాక్రమాలు అంటే ఏమిటో విన్నావు కదా! ఇది విన్న తరువాత కూడా నువ్వు వాలిని చంపగలనని అనుకుంటున్నావా? చంపగలిగే ధైర్యం ఉన్నదా? వాలి ఎన్నడూ ఎవరి చేత ఓడింపబడినవాడు కాదు. జీవితంలో ఓటమి అన్నది   వాలికి తెలియదు. వాలి పేరు చెబితేనే పారిపోతారు. పదిహేను సంవత్సరాలు రాత్రి - పగలు గోలభుడు అనే గంధర్వుడితో యుద్ధం చేసి ఆయనకి సంహరించాడు. నీను ఇంకొక విషయము చూపిస్తాను. ఇక్కడ ఏడు సాలవృక్షములు వరుసగా ఉన్నాయి కదా! మా వాలి రోజూ సంధ్యావందనం అయ్యాక ఇక్కడికి వచ్చి ఈ పెద్ద సాలవృక్షాన్ని చేతులతో కదుపుతాడు. ఆ కుదుపుకి లేత చిగురుటాకులు కూడా రాలిపోయి ఆ చెట్టు మోడుగా నిలబడుతుంది. వాలి బలం గురించి విన్నాక కూడా నీకు వాలిని చంపగలను అన్న ధైర్యం ఉన్నదా? " అన్నాడు.

సుగ్రీవుడు చెప్పిన మాటలు విన్న లక్ష్మణుడు ఒక చిన్న నవ్వు నవ్వి " మీ వాలి చాలా గొప్పవాడని చెబుతున్నావు కదా! వాలిని మా అన్నయ్య చంపగలడని ఏమి చేస్తే నువ్వు నమ్ముతావు? " అని అడిగాడు.

 సుగ్రీవుడు " మా వాలి ఈ ఏడు చెట్లని కుదిపెయ్యగలడు. రాముడు పోని అంత చెయ్యక్కరలేదు. బాణం పెట్టి ఒక సాలవృక్షాన్ని కొడితే నేను నమ్ముతాను. ఆనాడు దుందుభి యొక్క శరీరాన్ని మా అన్నయ్య విసిరేస్తే అది యోజనం దూరం వెళ్ళి పడింది. రాముడిని ఈ అస్థిపంజరాన్ని రెండు వందల ధనుస్సుల దూరం తన కాలితో తంతే నేను నమ్ముతాను " అని లక్ష్మణుడితో అన్నాడు.

 రాముడు " సరే! అలాగే చేస్తాను. నీకు నమ్మకము కలిగించడము కోసం నువ్వు చెప్పిన పని తప్పకుండా చేస్తాను " అన్నాడు.

రాఘవో దుందుభేః కాయం పాదాంగుష్ఠేన లీలయా |
తోలయిత్వా మహాబాహుః చిక్షేప దశయోజనమ్  ||

సుగ్రీవుడు చెప్పినట్టుగా రాముడు ఆ దుందుభి కళేబరాన్ని తన బొటను వేలితో తంతే అది పది యోజనముల దూరం వెళ్ళి పడింది. రాముడు సుగ్రీవుడి వంక నమ్మకము కుదిరిందా అన్నట్టు చూశాడు. సుగ్రీవుడు " ఆనాడు వాలి ఈ కళేబరాన్ని విసిరినప్పుడు ఇది రక్తమాంసాలతో పచ్చిగా చాలా బరువుగా ఉన్నది. అప్పటికే మా అన్నయ్య ఈ దుందుభితో చాలాసేపు యుద్ధం చేసి ఉన్నాడు, దానికితోడు తాగి ఉన్నాడు. తన భార్యలతో రమిస్తూ బయటకి వచ్చాడు.  అనేకరకములుగా బడలిపోయిన శరీరంతో ఉన్నాడు. రాముడు చాలా ఉత్సాహముగా ఉన్నాడు. మద్యాన్ని సేవించి లేడు పరీక్షకి నిలబడుతున్నాననే పూనికతో ఉన్నాడు. ఆనాడు మా అన్నయ్య విసిరింది ఒక పచ్చి శరీరము. అది ఒక యోజనం వెళ్ళి పడింది. ఈనాడు రాముడు తన్నినది ఎండిపోయిన కళేబరము. దానిని పదియోజనాలు తన్నడములో పెద్ద గొప్పేమున్నది? ఆ సాల వృక్షాన్నికూడా కొట్టమను నాకు కొంత నమ్మకము కలుగుతుంది మనం వాలిని సంహరించడానికి వెళదాము" అన్నాడు.

 రాముడు ఒక బంగారుబాణాన్ని చేతితో పట్టుకొని వింటినారికి సంధించిగురి చూసి   సాలవృక్షముల వైపు విడిచిపెట్టాడు. కనురెప్ప మూసి తెరిచే లోపల ఆ బాణము  ఏడు సాలవృక్షాలనీ పడగొట్టి ఎదురుగా ఉన్నటువంటి పర్వత శిఖరాన్ని తొలిచి  భూమిలో పాతాళలోకము వరకూ వెళ్ళి తిరిగొచ్చి రాముడి యొక్క అమ్ములపొదిలో కూర్చుండిపోయింది.

రాముడి శక్తి ఏమిటో చూసిన సుగ్రీవుడు వెంటనే రాముడి పాదాలకి తన శిరస్సు తగిలేటట్టు పడిపోయాడు. అప్పుడాయన కిరీటం రాముడి పాదాల మీద పడిపోయింది. సుగ్రీవుడు " రామా ! నీ బాణానికి ఉన్న వేగం ఇంద్రుడి బాణానికి కూడా లేదు. నేను ఏమో అనుకున్నాను ఇంక వాలి ఏమిటి? నువ్వు బాణ ప్రయోగము చేస్తే వజ్రాయుధము పట్టుకున్న ఇంద్రుడి శిరస్సు కూడా కింద పడిపోతుంది. నీ బాణానికి ఉన్న వేగము సామాన్యమైనది కాదు. వాలి దగ్గరికి వెళదాము పద " అన్నాడు.

"తప్పకుండా సుగ్రీవా ! బయలుదేరదాము" అని అందరూ బయలుదేరారు. ముందు సుగ్రీవుడు వేగంగా వెళుతున్నాడు. ఆయన వెనకాల రామలక్ష్మణులు, సుగ్రీవుడి మంత్రులైన హనుమంతుడు, నీలుడు, నలుడు మొదలైన వారు వెళుతున్నారు.

సర్వే తే త్వరితం గత్వా కిష్కింధాం వాలినః పురీమ్  |
వృక్షైఃరాత్మా నమావృత్య వ్యతిష్ఠన్ గహనే వనే ||

ముందు వెళుతున్న సుగ్రీవుడు కిష్కింద పట్టణంలోకి వెళ్ళిపోయాడు. మిగిలిన వారందరూ దట్టమైన చెట్ల చాటున పైకి కనపడకుండా దాగి ఉన్నారు. లోపలికి వెళ్ళిన సుగ్రీవుడు గట్టిగా కేకలు వేసి వాలిని బయటకి రమ్మన్నాడు. సుగ్రీవుడు ఇంత ధైర్యముగా పిలిచేసరికి వాలి ఆశ్చర్యంతో బయటకి వచ్చి " ఏరా బుద్ధిహీనుడా! మళ్ళీ వచ్చావు నా ప్రతాపము ఏమిటో చూద్దువు కాని రా! " అన్నాడు.  వాలి తన పిడికిలిని బిగించి సుగ్రీవుడి శిరస్సు మీద ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి సుగ్రీవుడి నవరంధ్రముల నుండి రక్తం ఏరులై పారింది. సుగ్రీవుడు తేరుకొని వాలిని కొట్టడము ప్రారంభించాడు, వాలి కూడా సుగ్రీవుడిని కొడుతున్నాడు. ఇద్దరూ అలా మోచేతులతో పొడుచుకుంటు, పాదములతో కొట్టుకుంటు, శిరస్సులతో కుమ్ముకుంటున్నారు. కొంత సేపు కొట్టుకున్నాక ఇంకా బాణము వెయ్యడము లేదు రాముడు ఎక్కడున్నాడని సుగ్రీవుడు అటూ ఇటూ చూశాడు కాని రాముడు కనపడలేదు. వాలితో యుద్ధం చెయ్యలేక సుగ్రీవుడు ఋష్యమూక పర్వతము మీదకి పారిపోయాడు. వాలి కూడా తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయాడు.
సుగ్రీవుడు ఆ ఋష్యమూక పర్వతం మీద ఒక శిల మీద కూర్చొని ఒంట్లోనుండి కారిపోతున్న రక్తాన్ని తుడుచుకుంటూ ఆయాసపడుతూ ఏడుస్తూ ఉన్నాడు.  లక్ష్మణుడితో కలిసి రాముడు అక్కడికి వచ్చాడు. వాళ్ళని చూడగానే సుగ్రీవుడు "   నేను నిన్ను వాలిని చంపమని అడిగానా ? నువ్వు వాలిని చంపుతానని ప్రతిజ్ఞ చేస్తేనే కదా! నేను యుద్ధానికి వెళ్ళాను. నేను వాలిని చంపను అని నువ్వు ఒకమాట చెబితే నేను వెళతానా ? నన్ను ఇలా ఎందుకు కొట్టించావు ? " అని రాముడిని ప్రశ్నించాడు.

  రాముడు " సుగ్రీవా ! నేను ఇంతకముందెన్నడూ వాలిని చూడలేదు. నువ్వు వాలితో యుద్ధం చేస్తున్నప్పుడు వాలి మీద బాణం వేద్దామని అనుకొని వచ్చాను.   వాలి బయటకి వచ్చాక నేను విస్మయము చెందాను. నువ్వు, వాలి ప్రతి విషయంలో ఒకేలా ఉన్నారు. మీరిద్దరూ దెబ్బలాడుకుంటుంటే అశ్విని దేవతలు దెబ్బలాడుకున్నట్టు ఉన్నది. మీలో ఎవరు వాలి? ఎవరు సుగ్రీవుడు ? నాకు తెలియలేదు. కంఠస్వరంలో మార్పు ఉంటుందేమో అని చూశాను. ఇద్దరూ ఒకేలా అరిచారు. ఇద్దరూ ఒకేలా పరిగెడుతున్నారు. ఒకేలా అలంకారము చేసుకున్నారు. ఇద్దరూ ఒకే వేగంతో కొట్టుకుంటున్నారు. ఎలాగో నిర్ణయించుకొని ఇతడే వాలి అయ్యుంటాడని బాణ ప్రయోగము చేస్తే సుగ్రీవా! అది తగిలినవాడు ఈ లోకమునందు ఉండడు. ఆ బాణము పొరపాటున నీకు తగిలితే నువ్వు నేను కూడా ఉండము.

గజ పుష్పీ మిమాం ఫుల్లాముత్పాట్య శుభలక్షణామ్ |
కురు లక్ష్మణ  కంఠేఽస్య సుగ్రీవస్య మహాత్మనః ||

నిన్ను వాలికన్నా వేరుగా గుర్తుపట్టాలంటే ఒకటే లక్షణం ఉంది. లక్ష్మణా! అక్కడ గజపుష్ప తీగ ఒకటి పాకుతోంది. నువ్వు దానిని తీసి సుగ్రీవుడి మెడలో కట్టు.   పెద్ద పెద్ద పువ్వులచే విరాజితుడై సుగ్రీవుడు ఉంటాడు. అటువంటి మాల లేనివాడై వాలి ఉంటాడు. అప్పుడు నేను వాలిని నిగ్రహించగలను. ఇప్పుడు ఆ మాల వేసుకొని మళ్ళీ  యుద్ధానికి వెళ్ళు " అన్నాడు.

సుగ్రీవుడు సరే అని బయలుదేరాడు. ఆయన వెనకాల రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు మొదలైన వారు బయలుదేరారు. అలా వారు వెళుతూ లోయలని, నదులని, పర్వతాలని, చెట్లని చూసుకుంటూ వెళుతున్నారు.   వాళ్ళకి పక్కన నుంచి అక్షర సముదాయము చేత అవ్యక్తమైనటువంటి గంధర్వ గానం ఒకటి వినపడింది. అది వింటున్నప్పుడు వాళ్ళ మనస్సులకి ఆనందము  కలుగుతోంది. అక్కడ ఉన్న చెట్లపైకి పావురాల రంగులో పొగలు చుట్టుకొని ఉన్నాయి. రాముడు ఈ వనము ఏమిటి? అని సుగ్రీవుడిని అడిగాడు.  సుగ్రీవుడు ఆగకుండా ముందుకి వెళ్ళిపోతూ " రామా ! ఇక్కడ సప్తజనులు అనేటటువంటి  ఏడుగురు  ఋషులు ఉండేవారు. వారు తలలు కిందకి పెట్టి, కాళ్ళు పైకి పెట్టి  ఏడువందలు సంవత్సరాలు తపస్సు చేశారు. అలా  తపస్సు చేస్తూ ప్రతి ఏడు  రాత్రులకి ఒకసారి గాలిని తినేవారు. వాళ్ళ తపస్సుకి ఇంద్రుడు ఆశ్చర్యపోయి సశరీరముగా స్వర్గలోకానికి తీసుకువెళ్ళాడు. వాళ్ళ తపోశక్తి ఇప్పటికీ ఈ వనంలో ఉన్నది. అందువలన క్రూరమృగం ఈ వనంలోకి వెళ్ళదు వెళితే ఇక తిరిగిరాదు. నువ్వు లక్ష్మణుడితో కలిసి నమస్కారము చెయ్యి " అన్నాడు.

 లక్ష్మణుడితో కలిసి రాముడు ఆ సప్తజనుల ఆశ్రమము వైపుకి తిరిగి నమస్కారం చేశాడు. వారు నమస్కారం చెయ్యగానే వాళ్ళ మనస్సులో గొప్ప ఉత్సాహము  పుట్టింది.

వాళ్ళందరూ కిష్కింద చేరుకున్నాక సుగ్రీవుడు వెళ్ళి గట్టిగా తొడలు కొట్టి కేకలు వేసి వాలిని పిలిచాడు. వాలి గబగబా బయటకి వస్తుండగా ఆయన భార్య అయిన తార (తార సుషేణుడి కుమార్తె) ఆపి " ఎందుకు అలా తొందరపడి వెళ్ళిపోతున్నావు. సుగ్రీవుడు ఇప్పుడే ఒక గంట క్రితం వచ్చాడు కదా! నవరంధ్రములనుండి నెత్తురు కారేటట్టుగా నువ్వు కొడితే దిక్కులు పట్టి పారిపోయాడు కదా! నువ్వు ఇంట్లోకి వచ్చి ఎంతో సేపు కాలేదు. సుగ్రీవుడు వచ్చి నిన్ను యుద్ధానికి రమ్మంటున్నాడు. నీకు అనుమానం రావడం లేదా?

సుగ్రీవుడు వచ్చి ' వాలి యుద్ధానికి రా ' అంటున్నాడంటే నాకు శంకగా ఉన్నది. సుగ్రీవుడు నిన్ను ఇప్పుడు పిలవడములో నీకు తేడా కనపడడం లేదా? చాలా ధైర్యంగా పిలుస్తున్నాడు. ఇప్పుడే దెబ్బలు తిని వెళ్ళినవాడిలో ఉండే బలహీనతలు కనపడడము లేదు. ఆ స్వరంలో ఒక పూనిక ఒక గర్వం కనపడుతున్నది. సుగ్రీవుడికి వెనకాల ఎవరిదో సహాయము ఉన్నది. నువ్వు సుగ్రీవుడితో యుద్ధం చేసేటప్పుడు నీకు వేరొకరితో ప్రమాదం పొంచి ఉన్నది. సుగ్రీవుడికి స్నేహం చెయ్యడములో మంచి తెలివితేటలు ఉన్నాయి. ఇక్ష్వాకు వంశంలో జన్మించిన అపారమైన శౌర్యమూర్తులైన దశరథ మహారాజు కుమారులైన రామలక్ష్మణులతో ఇవ్వాళ సుగ్రీవుడు స్నేహం చేశాడు నేను గూఢచారుల ద్వారా అంగదుడి(అంగదుడు వాలి - తారలు కుమారుడు) ద్వారా తెలుసుకున్న విషయము. నువ్వు నీ బలాన్ని నమ్ముకున్నావు, కాని సుగ్రీవుడి బుద్ధి బలాన్ని గూర్చి ఆలోచించడము లేదు.

సుగ్రీవుడు నీ తమ్ముడన్న విషయాన్ని మరిచిపోయి నీ తమ్ముడి భార్యని నీ భార్యగా అనుభవిస్తున్నావు. నీ తమ్ముడిని పక్కన పెట్టుకోవడము మానేసి శత్రుత్వాన్ని పెంచుకుంటున్నావు. మీ ఇద్దరి మధ్యలోకి మూడవ వ్యక్తి రావలసిన అవసరమేమిటి? ఇది నీ ఇంటి సమస్య. నా మాట వినీ సుగ్రీవుడిని ఆహ్వానించి యువరాజ పట్టాభిషేకము చెయ్యి. అప్పుడు నీ బలం పెరుగుతుంది. ఇవాళ నీ తమ్ముడు రాముడి నీడలో ఉన్నాడు. రాముడిలా నీడ ఇవ్వగలిగే చెట్టు ఈ ప్రపంచంలో లేదు " అన్నది.

వాలి శరీరము పడిపోవలసిన కాలం ఆసన్నమయ్యింది. ఈశ్వరుడు ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభించాడు కనుక ఇంతకాలం తార మాటలు వినడానికి అలవాటుపడ్డ వాలి ఆమె మాట వినడము మానేసి సుగ్రీవుడితో యుద్ధానికి వెళ్ళాడు.

ఇద్దరూ హోరాహోరుగా యుద్ధం చేసుకుంటున్నారు. ఈసారి సుగ్రీవుడు చెట్లని పెరికించి వాలిని తుక్కుగా కొట్టాడు. వాలి మెడలో ఇంద్రుడి మాల ఉండడము  వలన మెల్లగా సుగ్రీవుడి శక్తి నశించి వాలి బలం పెరిగింది. సుగ్రీవుడు ఇంతకముందులా పారిపోకుండా ఈసారి రాముడి కోసం అన్ని వైపులా చూశాడు.
సుగ్రీవుడి శక్తి తగ్గిపోవడము గమనించిన రాముడు వెంటనే బాణాన్ని తీసి వింటినారికి తొడిగించి వెనక్కి లాగాడు. అలా లాగడం వలన ఆ వింటినారి నుండి వచ్చిన ధ్వని యుగాంతమునందు ప్రళయము చేసేటప్పుడు హరుడు చేసే శబ్దంలా ఉన్నది. ఆ శబ్దము చేత మృగములన్నీ దిక్కులు పట్టి పారిపోయాయి, పక్షులు ఆకాశములోకి ఎగిరిపోయాయి.

రాఘవేణ మహా బాణో వాలివక్షసి పాతితః |

రాముడి బాణం యొక్క శబ్దం వినపడి ఆ శబ్దం ఎక్కడినుంచి వచ్చిందని వాలి అటువైపుకి తిరిగెలోగా ఆ బాణం అమితమైన వేగంతో వచ్చి వాలి గుండెల మీద పడింది. ఆ దెబ్బకి వాలి కిందపడిపోయాడు. రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడి మంత్రులు అక్కడికి వచ్చారు. పక్కనే చేతులు కట్టుకొని సుగ్రీవుడు నిలబడ్డాడు.  వాలి రాముడితో " రామా ! నువ్వు చాల గొప్పవాడివి ధర్మం తెలిసినవాడివి పరాక్రమము ఉన్నవాడివి అంటారు. నీతో కాకుండా ఇంకొకరితో నేను అటువైపుకి తిరిగి యుద్ధం చేస్తుంటే ఇంత ధర్మాత్ముడివి అయిన నువ్వు చెట్టు చాటు నుంచి నా మీద బాణం వెయ్యడానికి సిగ్గుగా లేదా? నా చర్మము ఒలిచి వేసుకోడానికి, మాంసము తినడానికి పనికిరావు. యుద్ధం అంటూ వస్తే బంగారం వల్ల, వెండి వల్ల, భూమి వల్ల రావాలి. నీకు నాకు ఈ విషయాలలో తగాదా లేదు. నేను చెట్ల మీద ఉండే ఆకులని, పండ్లని తినే శాఖామృగాన్ని. నువ్వు మనిషివి, ధర్మం అనే తొడుగు కప్పుకున్న మహా పాపాత్ముడివి. చేతిలో కోదండము పట్టుకొని కనపడ్డ ప్రతి ప్రాణిని హింసించే స్వభావము ఉన్నవాడివి. నీయందు కామము విపరీతంగా ఉన్నది. అందుచేతనే ఏ కారణం లేకుండా నన్ను కొట్టి చంపావు. నువ్వు నాకు ఎదురుగా వచ్చి నిలబడి యుద్ధం చేసినట్టయితే, ఆ యుద్ధంలో నేను నిన్ను యమసదనానికి పంపించి ఉండేవాడిని.

అయిదింటి మాంసాన్ని మాత్రమే బ్రాహ్మణులు, క్షత్రియులు తినాలని ధర్మశాస్త్రం చెబుతుంది. ( త్రేతా యుగంలో బ్రాహ్మణులు కూడా మాంసాన్ని తినేవారు, కలికాలంలో అది నిషిద్దము. అరణ్యకాండలో అగస్త్యమహర్షి వాతాపి, ఇల్వలుడు అనే రాక్షసులని చంపేముందు మాంసాహారాన్ని తిన్నారు). అయిదు గోళ్ళున్న వాటిల్లో ముళ్ళపంది మాంసాన్ని తినచ్చు. చెవులపిల్లి మాంసాన్ని తినచ్చు. ఉడుముమాంసాన్ని తినచ్చు. తాబేలుమాంసాన్ని తినచ్చు. కుక్కలని తరిమి చంపే ఏదుపంది మాంసాన్ని తినవచ్చు. ఇంక ఆరవదాని మాంసం తినకూడదు. ఒకవేళ అలా తిన్నారాజ్యం చేస్తున్న రాజుని చంపినా, గోవుని చంపినా, బ్రాహ్మణుడిని చంపినా, అలా చేసిన వారికి పాతకం చేసిన పాపం వస్తుంది. నువ్వు నన్ను చంపడానికి కారణం ఏమిటి? నువ్వు చేసినవి దోషాలు కావా? నాకు జవాబు చెప్పు.

  నీ భార్య కోసం అడవిలో వెతుక్కుంటున్నావుట కదా! నీ భార్యని ఎత్తుకుపోయిన రావణాసురుడు నా కింకరుడు. నువ్వు నాతో చెప్పి ఉంటే పశువుని ఈడ్చుకు వచ్చినట్టు రావణుడిని మెడలో పాశం వేసి నీ కాళ్ళ ముందు పడేసేవాడిని. అటువంటిది నాకు చెప్పకుండా, నన్నే గెలవలేని సుగ్రీవుడిని ఆశ్రయించి నువ్వు సీతని ఎలా తెచ్చుకోగలవు? సుగ్రీవుడి కోసం నన్ను చంపావు. ఇది కిరాయి హత్య కాదా? నువ్వు ఈ పని చెయ్యొచ్చా ?" అని రాముడిని ప్రశ్నించి, ఇక మాట్లాడడానికి ఓపిక లేక ఉండిపోయాడు.

ధర్మమ్  అర్థం చ కామం చ సమయంచాపి లౌకికమ్  |
అవిజ్ఞాయ కథం బాల్యాత్ మామిహాద్య విగర్హసే ||

 రాముడు " నీకు అసలు ధర్మం గురించి కాని, అర్ధం గురించి కాని, కామం గురించి కాని తెలుసా? నువ్వు అజ్ఞానివి. బాలుడు ఎలా ప్రవర్తిస్తాడో నువ్వు అలా ప్రవర్తించేవాడివి. నీకు ఏమి తెలుసని నామీద ఇన్ని ఆరోపణలు చేశావు? నువ్వు అజ్ఞానివి కావడము వలన నీకు తెలియకపోతే ఆచారం తెలిసినవారిని, పెద్దలైనవారిని ఆశ్రయించి కనుక్కోవాలి. నువ్వు అవేమి తెలుసుకోకుండా నా గురించి అడుగుతున్నావు. ఇక్ష్వాకుల యొక్క రాజ్యంలోకి ఈ భాగం కూడా వస్తుంది. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన భరతుడు ఇప్పుడు రాజ్యం చేస్తున్నాడు. ఇక్ష్వాకు వంశంవారు రాజ్యం చేస్తుండగా ధర్మాధర్మములు జరిగిన చోట నిగ్రహించే అధికారం మాకు ఉంటుంది. నీకు కామం తప్ప వేరొకటి తెలియదు. అందుచేత నీకు ధర్మాధర్మ విచక్షణ చేసే అధికారము లేదు. జన్మనిచ్చిన తండ్రి, పెద్ద అన్నగారు, చదువు నేర్పిన గురువు, ఈ ముగ్గురు తండ్రులతో సమానం. అలాగే తనకి జన్మించిన కుమారుడు, తోడబుట్టిన తమ్ముడు, తన దగ్గర విద్య నేర్చుకున్న శిష్యుడు ముగ్గురూ కుమారులతో సమానము.

నీ తండ్రి మరణించడము చేత, నువ్వు పెద్దవాడివి అవడము చేత నువ్వు తండ్రితో సమానము. నీ తమ్ముడు సుగ్రీవుడి భార్యయిన రుమ నీకు కోడలితో సమానము.  సుగ్రీవుడు బతికి ఉన్నాడని తెలిసి, కోడలితో సమానమైన రుమని నువ్వు అనుభవించి, నీ భార్యగా కామ సుఖాలని పొందుతున్నావు ( వాలి బిలంలో ఉండిపోయినప్పుడు వాలి మరణించాడు అనుకొని సుగ్రీవుడికి పట్టాభిషేకము  చేశారు. సుగ్రీవుడు వాలి భార్య అయిన తారని తన భార్యగా అనుభవించాడు. మరి సుగ్రీవుడు చేసింది దోషం కాదా? ఇక్కడ మీరు గమనించవలసిన విషయం  సంధ్యావందనం చేసే వానరజాతికి, రాజ్యపాలన చేసే వానరజాతికి, మంత్రులచేత సేవింపబడే వానరజాతికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ జాతిలోని స్త్రీలు తమ భర్త మరణిస్తే మరిదిని పునర్వివాహం చేసుకొని వారితో ఉండచ్చు. ఆనాడు వాలి చనిపోయాడనుకొని తార సుగ్రీవుడిని వివాహమాడింది. కనుక సుగ్రీవుడితో ఆనాడు తార ఉండడం ధర్మం తప్పడము కాదు. సుగ్రీవుడు బతికే ఉన్నాడని తెలిసి కూడా ఆయన భార్యతో కామ సుఖాలని అనుభవించడం వాలి యొక్క దోషం. కేవలం పైన చెప్పిన వానరజాతికి మాత్రమే ఈ నియమం. మనుష్యులకి కాదు. అలాగే వాలికి రెండుశక్తులు ఉన్నాయి. ఒకటి ఇంద్రుడు ఇచ్చిన మాలని మెడలో వేసుకుంటే వాలి అపారమైన ఉత్సాహంతో ఉంటాడు. రెండు ఎవరన్నా వాలికి ఎదురుగా వెళితే వాళ్ళ శక్తిలో సగం శక్తిని ఈయన లాగేసుకుంటాడు, ఇది బ్రహ్మగారు వాలికి ఇచ్చిన వరం. అలాగే వాలికి రావణాసురుడికి స్నేహం ఉన్నది. వాళ్ళిద్దరూ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ప్రకారం వాలి అనుభవించే స్త్రీని రావణుడు అనుభవించచ్చు. వాలికి శత్రువు రావణుడికి శత్రువే........అలా కొన్ని విషయాలలో ఒప్పందం కుదుర్చుకున్నారు ).

అందుచేత ఒక మామగారు కోడలితో కామభోగాన్ని అనుభవిస్తే ఎంత దోషమో అంత దోషాన్ని నువ్వు చేశావు. ధర్మశాస్త్రంలో దీనికి మరణశిక్ష తప్ప వేరొక శిక్ష లేదు. అందుకని నేను నిన్ను చంపవలసి వచ్చింది. నువ్వు ప్రభువువి, మంత్రుల చేత సేవింపబడుతున్నవాడివి. సంధ్యావందనం చేస్తున్నవాడివి. నువ్వు ధర్మం తప్పితే నీ వెనుక ఉన్నవారు కూడా ధర్మం తప్పుతారు. నేను క్షత్రియుడని కనుక నిన్ను శిక్షించవలసిన అవసరం నాకు ఉన్నది. ఇది తప్పు అని తెలిసికూడా నేను నిన్ను శిక్షించకపోతే నువ్వు చేసిన పాపం నాకు వస్తుంది. ఈ పాపం అవతలవాడు చేశాడని ప్రభువైనవాడికి తెలిసి వాడిని శిక్షిస్తే వాడి పాపం పోతుంది. ప్రభువు అలా శిక్షించకపోతే ఆ పాపం రాజుకి వెళుతుంది. అందుకే మా వంశంలో ఇంతకు పూర్వం మాంధాత అనే రాజు ఒక శ్రమణికుడు ఇటువంటి దోషం చేస్తే శిక్ష వేశాడు. ఇంక నాతో ఎందుకు స్నేహం చెయ్యలేదు. చేసి ఉంటే సీతమ్మని తీసుకు వచ్చేవాడిని అన్నావు కదా! నీలాంటి అధర్మాత్ముడితో నేను స్నేహం చెయ్యను. నన్ను చెట్టు చాటునుండి చంపావు వేరొకడితో యుద్ధం చేస్తుంటే కొట్టావు అది దోషం కాదా? అని నన్ను అడిగావు. దానికి నేను సమాధానం చెబుతాను విను.

తప్పు చేసినవాడిని రాజు శిక్షిస్తే వాడి పాపం ఇక్కడితో పోతుంది. నేను నిన్ను చంపడం వల్ల నువ్వు ఏ పాపము లేని స్థితికి వచ్చావు. నీ పాపం ఇక్కడితో పోయింది అందుకని నువ్వు ఉత్తమలోకాలకి వెళ్ళిపోతావు.
న మే తత్ర మనస్తాపో న మన్యుర్హరియూథప |
వాగురాభిశ్చ పాశైశ్చ కూటైశ్చ వివిధైర్నరాః ||
నేను మానవుడిని, నువ్వు వానరానివి. నేను మనిషిని నువ్వు జంతువువి. క్షత్రియుడు, మాంసం తినేవాడు, ధర్మాన్ని నిలబెట్టవలసినవాడు ఒక మృగాన్ని కొట్టవలసి వస్తే తాను చాటున ఉండి కొట్టచ్చు, వల వేసి పట్టుకొని కొట్టచ్చు. పాశం వేసి పట్టుకొని కొట్టచ్చు. అది అప్రమత్తంగా ఉన్నప్పుడు కొట్టచ్చు. అది పడుకొని ఉన్నప్పుడు కొట్టచ్చు. నిలబడి ఉన్నప్పుడు కొట్టచ్చు. పారిపోతున్నప్పుడు కొట్టచ్చు. ఎప్పుడైనా కొట్టచ్చు. కాని ఆ మృగం వేరొక స్త్రీ మృగంతో సంగమిస్తున్నప్పుడు మాత్రం బాణ ప్రయోగము చెయ్యకూడదు. నువ్వు మైధున లక్షణంతో లేవు. అందుకని నిన్ను కొట్టాను. నేను నరుడిని కనుక మృగానివైన నిన్ను ఎలా కొట్టినా నాకు పాపం రాదని తెలిసి కొట్టాను. కాని నువ్వు చనిపోయేముందు రోషం కలిగి నన్ను ప్రశ్నించావు. నాయందు ఎటువంటి దోషము లేదు " అని రామచంద్రమూర్తి సమాధానమిచ్చారు.

రాముడు మాటలు విన్న వాలి తన రెండుచేతులతో రాముడికి నమస్కారం పెట్టి " మహానుభావా ! ధర్మాత్మా ! రామచంద్రా ! నువ్వు చెప్పినది పరమ యదార్థము. దోషం నాయందే ఉన్నది. నువ్వు నన్ను చంపడంలోకాని నాయందు దోషం ఉన్నదని చెప్పడంలోకాని కించిత్ సందేహం లేదు. నువ్వు ధర్మాధర్మ విచక్షణ చేత నీకు ఉన్న జ్ఞానం చేత పూర్వాపరములను బాగా పరిశీలించిన మీదట ఏమిచెయ్యాలో నిర్ణయించుకుని దానిని అమలుచేసి దానిమీద స్థిరంగా నిలబడగల వ్యక్తిత్వం ఉన్నవాడివి. అటువంటి నిన్ను చూసి పొంగిపోతున్నాను.  నీ చేతిలో మరణమైనా నాకు స్వర్గమే " అన్నాడు.

Today thidi details

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
ఏప్రిల్ 11, 2020
శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్ర మాసం బహుళ పక్షం
తిధి :చవితి రా12.17తదుపరి పంచమి 
వారం :శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం :అనూరాధ రా1.14 తదుపరి జ్యేష్ఠ
యోగం:సిద్ధి ఉ6.40 తదుపరి వ్యతీపాతం తె4.13
కరణం:బవ మ1.07 తదుపరి బాలువ రా12.17 ఆ తదుపరి కౌలువ 
వర్జ్యం  :ఉ.శే.వ7.32వరకు
దుర్ముహూర్తం  :ఉ5.50 - 7.28
అమృతకాలం  :మ3.14 - 4.46
రాహుకాలం :ఉ9.00 - 10.30
యమగండం/కేతుకాలం:మ1.30 - 3.00
సూర్యరాశి :మీనం
చంద్రరాశి   : తుల
సూర్యోదయం       :5.50
సూర్యాస్తమయం :6.10
సంకష్టహర చతుర్థీ వ్రతము
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

Srimadramayana Pravachanamruthadhara -- 49

Srimadramayana Pravachanamruthadhara -- 49 By Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu

  రామలక్ష్మణులని సుగ్రీవుడు ఉన్న ప్రాంతానికి తీసుకొచ్చేటప్పుడు హనుమంతుడు తన కపి రూపాన్ని వదిలి భిక్షురూపాన్ని పొందాడు.  హనుమంతుడు సుగ్రీవుడితో

అయం రామో మహాప్రాజ్ఞః సంప్రాప్తో దృఢ విక్రమః |
లక్ష్మణేన సహ భ్రాత్రా రామోఽయం సత్యవిక్రమః ||

" సుగ్రీవా! వచ్చినటువంటివాడు మహా ప్రాజ్ఞుడైన ధృడమైన విక్రమము ఉన్న రామచంద్రమూర్తి మరియు ఆయన తమ్ముడు లక్ష్మణుడు. రాముడిని దశరథ మహారాజు అరణ్యవాసానికి పంపిస్తే అరణ్యాలకి వచ్చాడు తప్ప ధర్మబద్ధమైన నడువడిలేక రాజ్యాన్ని పోగొట్టుకున్నవాడు కాదు. తన భార్య అయిన సీతమ్మతో, లక్ష్మణుడితో అరణ్యవాసమునకు వస్తే, ఆయన భార్యని ఎవడో ఒక రాక్షసుడు అపహరించాడు. సీతమ్మని అన్వేషిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. నిన్ను శరణాగతి చేస్తున్నాడు. నీతో స్నేహం చెయ్యాలనుకుంటున్న ఈయనతో స్నేహం చెయ్యవలసింది " అన్నాడు.

  సుగ్రీవుడు " రామ! మీ దగ్గర గొప్ప తపస్సు ఉన్నది. అనేకమైన గుణములు, విశేషమైన ప్రేమ ఉన్నది. ఇన్ని గుణములు కలిగిన వ్యక్తి నాకు స్నేహితుడిగా లభించడము నా అదృష్టం. ఇటువంటి వ్యక్తి స్నేహితుడిగా లభిస్తే ఈ ప్రపంచంలో దేనినైన పొందవచ్చు. ఇది నాకు దేవతలు ఇచ్చిన వరమని అనుకుంటున్నాను. రామా ! నీకు తెలియని విషయము కాదు స్నేహం చేసేటటువంటివాడికి ఒక ధర్మం ఉంది. భర్త ఎలాగైతే తన కుడి చేతిని భార్య కుడి చేతితో బాగా రాశి పట్టుకుంటాడో అలా స్నేహం చేసేవాళ్ళు కూడా పట్టుకోవాలి. నువ్వు నాతో స్నేహమును ఇచ్చగించిన వాడివైతే నా బాహువుని చాపుతున్నాను. నీ బాహువుని నా బాహువుతో కలుపు " అన్నాడు.

  హనుమంతుడు తన సన్యాసి రూపాన్ని విడిచిపెట్టి కపి రూపానికి వచ్చేసి గబగబా వెళ్ళి నాలుగు ఎండిపోయిన కట్టెలని తెచ్చి కర్రతో కర్రని రాపాడించి అగ్నిహోత్రాన్ని పుట్టించాడు.  రాముడు, సుగ్రీవుడు ఆ అగ్నిహోత్రానికి ప్రదక్షిణ చేసి ఇద్దరూ తమ చేతులు కలుపుకున్నారు.

  రాముడు " మనిద్దరము స్నేహం చేసుకున్నాము. ఇకనుంచి  కష్టసుఖాలు ఇద్దరివీ " అన్నాడు.

సుగ్రీవుడు వెంటనే వెళ్ళి పుష్పించి ఉన్న పెద్ద సాలవృక్షము కొమ్మని విరిచి రాముడికి ఆసనంగా వేసి కుర్చోమన్నాడు. హనుమంతుడు ఒక గంధపుచెట్టు కొమ్మని తీసుకొచ్చి లక్ష్మణుడిని కుర్చోమన్నాడు. రామలక్ష్మణులిద్దరు కూర్చున్న తరువాత సుగ్రీవుడు " రామా ! నన్ను నా అన్నగారైన వాలి రాజ్యంనుండి వెళ్ళగొట్టాడు. నా భార్యని తన భార్యగా అనుభవిస్తున్నాడు. దిక్కులేనివాడినై ఈ కొండమీద మీద జీవితాన్ని గడుపుతున్నాను " అన్నాడు.

ఉపకార ఫలం మిత్రం విదితం మే మహాకపే |
వాలినం తం వధిష్యామి తవ భార్యాపహారిణమ్  ||
 రాముడు " ఉపకారము చేసినవాడు స్నేహితుడు. నువ్వు కష్టంలో ఉన్నావు  నేను నీ స్నేహితుడిని నీకు ఉపకారము చెయ్యాలి. నువ్వు బ్రతికి ఉండగా వాలి నీ భార్యని తన భార్యగా అనుభవిస్తున్నాడు. ఈ ఒక్కమాట చాలు ధర్మం తప్పిన  వాలిని చంపేస్తాను " అన్నాడు.

ఈ మాటలు విన్న సుగ్రీవుడు, సుగ్రీవుడి మంత్రులు పొంగిపోయారు. ఒకరిని ఒకరు చూపులతో తాగుతున్నారా ! అన్నట్టుగా చూసుకున్నారు. రాముడు, సుగ్రీవుడు ఒకళ్ళ చేతిలోఒకరు చెయ్యి వేసుకుని సంతోషముగా మాట్లాడుతుంటే, ముగ్గురికి ఎడమకళ్ళు అదిరాయి. పద్మంలాంటి కన్నులున్న సీతమ్మ ఎడమ కన్ను, బంగారంలాంటి పచ్చటి కన్నులున్న వాలి ఎడమకన్ను, ఎర్రటి కన్నులున్న రావణాసురుడి ఎడమకన్ను అదిరాయి.

  సుగ్రీవుడు " కనపడకుండా పోయిన వేదాన్ని మళ్ళి తీసుకొచ్చి ఇచ్చినట్టు నీకు నేను సీతమ్మని తీసుకొచ్చి ఇస్తాను. పాతాళలోకంలో, స్వర్గలోకంలో ఎక్కడ దాచినా నేను సీతమ్మని వెతికి తీసుకొస్తాను " అన్నాడు.

సుగ్రీవుడి మాటలు విన్న రాముడికి సీతమ్మ గుర్తుకువచ్చి భోరున రోదించాడు.

 సుగ్రీవుడు " రామా ! శోకించకు. నీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన గురించి చెబుతాను. ఒకనాడు నేను ఈ పర్వత శిఖరాల మీద మంత్రులతో కలిసి కూర్చొని ఉన్నాను. ఆకాశంలో ఎర్రటి నేత్రములు కలిగిన రాక్షసుడు పచ్చటి వస్త్రములు కట్టుకున్న ఒక స్త్రీని తీసుకుపోతున్నాడు. ఆ తల్లి తన చీర కొంగుని చింపి అందులో తన ఆభరణములను కొన్నిటిని మూటకట్టి పైనుండి కిందకి జారవిడిచింది. బహుశా ఆ స్త్రీ సీతమ్మయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను వెళ్ళి ఆ ఆభరణములు తీసుకొస్తాను అవి సీతమ్మ ఆభరణాలేమో చూడు " అన్నాడు.

కొంతసేపటికి సుగ్రీవుడు ఆ ఆభరణములు తీసుకొచ్చాడు. వాటిని చూసేసరికి ఒక్కసారి శోకం తన్నుకొచ్చినవాడై రాముడు మూర్ఛపోయి నేలమీద పడిపోయాడు. ఆయన తేరుకొని చూద్దాము అంటే కళ్ళనిండా నీరు ఉండడము చేత ఎన్నిసార్లు తుడుచుకున్నా ఆ కన్నీరు ఆగడములేదు కనుక  లక్ష్మణుడిని పిలిచి " లక్ష్మణా! ఈ ఆభరణములను ఒక్కసారి చూడు. ఇవి విరిగిపోయి ముక్కలు అవ్వలేదు ఈ ఆభరణములను విడిచిపెట్టినప్పుడు ఇవి గడ్డి మీద పడిఉంటాయి. నువ్వు వీటిని ఒకసారి చూడు " అన్నాడు.

న అహం జానామి కేయూరే న అహం జానామి కుండలే |
నూపురే త్వభిజనామి నిత్యం పాదాభివందనాత్ ||
  లక్ష్మణుడు " అన్నయ్యా! ఈ కేయూరాలు, ఈ కుండలాలు వదిన పెట్టుకున్నదో లేదో నాకు తెలియదు. ఈ నూపురాలు మాత్రం వదినవే. నేను ప్రతిరోజు  కాళ్ళకి నమస్కారము పెట్టే సమయమున ఈ నూపురాలని వదిన పాదాలకి చూశాను " అన్నాడు.

ఈవిషయము చెప్పిన తరవాత రాముడు విశేషముగా బాధ పడుతుంటే సుగ్రీవుడు " రామా ! ఏడవకు  నేను కూడా నీలాగే కష్టపడుతున్నాను. నువ్వే ఆలోచించు నేను నీలా ఏడుస్తున్నానా ? నీలాగే నా భార్య కూడా అపహరింపబడింది. నీకు చెప్పగలిగేంత సమర్దుడిని కాదు. ఒక్కసారి నీకు జ్ఞాపకము చేద్దామని స్నేహలక్షణముతో చెప్పాను. నీ యొక్క దుఃఖాన్ని ఉపశమింప చేసుకో. నాయందు ఉన్న స్నేహాన్ని జ్ఞాపకము చేసుకో " అన్నాడు.

వెంటనే రాముడు స్వస్థతని పొంది " ఉత్తమమైన మిత్రుడు ఎటువంటి మాట చెప్పాలో అటువంటి మాట చెప్పావు సుగ్రీవా ! ఈ రాక్షసుడు ఎక్కడ ఉంటాడో నాకు చెప్పు నేను వెంటనే వెళ్ళి రాక్షస సంహారము చేస్తాను " అన్నాడు.

 సుగ్రీవుడు " నేను సత్యం చెబుతున్నాను, నా మాట నమ్ము. నీ భార్యని తీసుకొచ్చే పూచి నాది. నీ భార్యని అపహరించిన రాక్షసుడి పేరు, ఎక్కడుంటాడో తెలియదు. నువ్వు బెంగ పెట్టుకోవద్దు ముందు నా కార్యమునకు సహాయము చెయ్యి " అన్నాడు.

 రాముడు " ఆ వాలి ఎక్కడ ఉంటాడో చెప్పు నేను వెంటనే సంహరిస్తాను. ఇంతకముందెన్నడు నేను అసత్యం పలకలేదు, ఇక ముందు కూడా అసత్యం పలకను. నీకు మాట ఇచ్చిన ప్రకారము వాలిని సంహరిస్తాను " అన్నాడు.

  సుగ్రీవుడు " నువ్వు ఇంత మాట అన్నావు నాకు ఇంకేమి కావాలి. నీలాంటి స్నేహితుడు లభిస్తే స్వర్గలోకమే లభిస్తుంది. ఇక వానర రాజ్యం లభించడము  గొప్ప విషయమా! " అన్నాడు.

 రాముడు " నువ్వు ఈ కొండమీద బ్రతకవలసిన అవసరం ఎందుకు ఏర్పడింది? అసలు ఏమి జరిగిందో నాకు అన్నీ వివరంగా చెప్పు " అన్నాడు.

 సుగ్రీవుడు జరిగిన కథని సంగ్రహముగా రాముడికి వివరించాడు. సుగ్రీవుడు చెప్పిన కథ విన్న రాముడు " అసలు నీకు నీ అన్న అయిన వాలికి ఎందుకు శత్రుత్వం ఏర్పడింది? నువ్వు నాకు ఆ విషయాన్ని పూర్తిగా చెపితే నేను మీ ఇద్దరి బలాబలాలని అంచనా వేస్తాను. మనం వెంటనే వెళ్ళవచ్చు " అన్నాడు.

 సుగ్రీవుడు అసలు కథని వివరంగా  " రామా ! ఒకానొకప్పుడు మా తండ్రి అయిన ఋక్షరజస్సు ఈ వానరరాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ ఋక్షరజస్సుకి ఇంద్రుడి అనుగ్రహంగా వాలి ఔరసపుత్రుడిగా జన్మించాడు, సూర్యుడి అనుగ్రహముగా నేను ఔరసపుత్రుడిగా జన్మించాను. పెద్ద కుమారుడైన వాలి తండ్రి యొక్క ప్రీతిని పొందాడు. నేను కూడా చాలాకాలం వాలిని ప్రీతితో అనుగమించాను. కొంతకాలానికి ఋక్షరజస్సు శరీరాన్ని విడిచిపెట్టాక పెద్ద కుమారుడు కనుక వాలికి పట్టాభిషేకము చేశారు. నేను వాలియందు వినయవిధేయలతో భయభక్తులతో ఉండేవాడిని.

దుందుభి అనే రాక్షసుడి అన్నయిన మయుడికి ఒక కుమారుడు ఉన్నాడు. వాడి పేరు మాయావి. మాయవికి, వాలికి ఒక స్త్రీ సంబంధముగా వైరం వచ్చింది. ఆ కారణం చేత మాయావి ఒకరోజు రాత్రి కిష్కింద ద్వారం దగ్గరికి వచ్చి గట్టిగా కేకలు వేసి ' వాలి బయటకి రా! మనిద్దరము యుద్ధం చేద్దాము. ఈరోజుతో నిన్ను సంహరిస్తాను ' అన్నాడు. అప్పటివరకూ తన భార్యలతో సంతోషముగా కాలం గడుపుతున్న వాలి గబగబా బయటకి వచ్చాడు. అప్పుడు నేను కూడా బయటకి వచ్చాను. మాయావి మా ఇద్దరినీ చూసి భయపడి పారిపోయాడు. అక్కడున్న స్త్రీలు ' ఎలాగు వాడు పారిపోతున్నాడు కదా! ఇంక విడిచిపెట్టు ' అన్నారు.  శత్రువుని విడిచిపెట్టనని వాలి వాడి వెనకాల పరిగెత్తాడు. నేను కూడా వాలి వెనకాల వెళ్ళాను.

పరిగెత్తి పరిగెత్తి తృణముల చేత కప్పబడిన ఒక పెద్ద బిలంలోకి ఆ మాయావి దూరిపోయాడు. అక్కడికి వెళ్ళి నేను, వాలి నిలబడ్డాము. వాలి నాతో ' సుగ్రీవా! నువ్వు ఈ బిల ద్వారం దగ్గర కాపలాగా ఉండు. నేను ఇందులోకి వెళ్ళి ఆ రాక్షసుడిని సంహరించి వస్తాను. నువ్వు నా తమ్ముడివి చిన్నవాడివి నా పాదముల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను. నువ్వు ఇక్కడే ఉండు ' అని చెప్పి వాలి గుహలోపలికి వెళ్ళాడు.

వాలి లోపలికి వెళ్ళి ఒక సంవత్సర కాలము గడిచిపోయింది. నేను బయట అలాగే నిలబడ్డాను. చాలాకాలం తరువాత లోపలినుండి రాక్షసుల కేకలు వినపడ్డాయి. ఆ ద్వారం దగ్గర నురగతో కూడిన నెత్తురు ప్రవహిస్తూ బయటకి వచ్చింది. ఎక్కడా వాలి మాట, అలికిడి వినపడలేదు. బహుశా మా అన్నగారైన వాలిని ఈ రాక్షసులు సంహరించి ఉంటారు అనుకొని ఈ రాక్షసులు బయటకి వస్తే ప్రమాదమని నేను ఒక పెద్ద శిలని తీసుకొచ్చి ఆ బిలానికి అడ్డుగా పెట్టాను. నేను చనిపోయాడనుకున్న వాలికి అక్కడే ఉదకక్రియ నిర్వహించి తర్పణలు విడిచిపెట్టాను.

తరువాత నేను రాజ్యానికి వచ్చి ఎవ్వరికీ తెలియకుండా శాస్త్రం ప్రకారము వాలికి చేయవలసిన కార్యములను చేశాను. నేను అంత జాగ్రత్తగా ఎవరికి తెలియకుండా చేసినప్పటికీ మంత్రులు విషయాన్నికనిపెట్టి రాజు లేకుండా రాజ్యం ఉండకూడదని   నన్ను బలవంతంగా సింహాసనము మీద కూర్చోపెట్టి పట్టాభిషేకము చేశారు. నేను చాలా ధర్మబద్ధముగా వానర రాజ్యాన్ని పరిపాలిస్తూ కాలం గడుపుతున్నాను.

ఒకనాడు అకస్మాత్తుగా మా అన్న వాలి తిరిగివచ్చాడు. అప్పుడాయన ఎర్రనైన కళ్ళతో నావంక చూశాడు. నా మంత్రులని స్నేహితులని బంధించి కారాగారంలో వేశాడు. ఆ సమయంలో నేను ప్రభువుగా ఉన్నాను కనుక నాకున్న బలం చేత నేను వాలి బంధించి కారాగారంలో పెట్టగలను. కాని నేను అలా చెయ్యలేదు. ఆయన నాకు అన్నగారు నేను గౌరవించాలి అందుకని నేను ఆయనని నిగ్రహించలేదు.

దిష్ట్యాఽసి కుశలీ ప్రాప్తో నిహతఃశ్చ త్వయా రిపుః |
అనాథస్య హి మే నాథః త్వమేకోఽనాథ నందనః ||

 నేను ఆయన దగ్గరికి వెళ్ళి నా రెండుచేతులని జోడించి శిరస్సు వంచి ' అన్నయ్యా! నువ్వు లేక నేను అనాథనయ్యాను. నువ్వు తిరిగి రావడము వలన ఇవ్వాళ నేను నాథుడున్న వాడిని అయ్యాను. నాకు ఎంతో సంతోషముగా ఉన్నది. నూరు తీగలున్న ఈ తెల్లటి ఛత్రాన్ని నీ శిరస్సుకి పెడతాను. నీకు చామరం వేస్తాను. నువ్వు సింహాసనము మీద కూర్చొని పూర్వం ఎలా పరిపాలించేవాడివో అలా పరిపాలించు. నేనెప్పుడూ పట్టాభిషేకము  చేసుకుందామని అనుకోలేదు. బలవంతముగా మంత్రులు, పౌరులు నాకు పట్టాభిషేకము చేశారు. నేను నీకు శిరస్సువంచి అంజలి ఘటిస్తున్నాను. ఎప్పటికీ నువ్వే వానరరాజ్యానికి రాజువి రాజ్యాన్ని స్వీకరించు ' అన్నాను.

 వాలి ' ఛీ! ఛీ! పరమదుష్టుడా! నేను లేని సమయము చూసి నువ్వు పట్టాభిషేకము చేసుకున్నావు. నువ్వు పరమ దుర్మార్గుడివి ' అన్నాడు. మరునాడు జానపదులను, మంత్రులను, ఇతరమైన వానరములను పిలిచి ఒక పెద్ద సభ తీర్చాడు. నేను వాలి పక్కన నిలబడ్డాను.  నన్ను చూసి ' నేను దురాత్ముడైన మాయవిని చంపడం కోసమని ఒక రాత్రి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఈ మహాపాపి అయిన నా తమ్ముడు నన్ను అనుగమించి వచ్చాడు. నేను రాక్షసులని చంపి వెనక్కి వస్తాను. నువ్వు బిల ద్వారం దగ్గర కాపలాగా ఉండమన్నాను. పాపపు ఆలోచన కలిగిన సుగ్రీవుడు నేను లోపలికి వెళ్ళగానే  నేను లోపల మరణిస్తానని ద్వారమునకు శిలను అడ్డు పెట్టాడు. తిరిగొచ్చి పట్టాభిషేకము చేసుకున్నాడు. నేను లోపలికి వెళ్ళాక మాయావి నాకు కనపడలేదు. ఒక సంవత్సర కాలం వెతికాక ఆ మాయావి తన బంధువులతో, స్నేహితులతో కనపడ్డాడు. నేను వాళ్ళందరినీ సంహరించాను. ఆ గుహ అంతా నెత్తురుతో నిండిపోయింది. నేను బయటకి వద్దాము అనుకున్నాను. వీడు శిలని అడ్డుపెట్టాడు. నేను ఎంతో కష్టంతో ఆ శిలని పక్కకి తోసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి వీడు రాజ్యాన్ని పరిపాలిస్తూ సింహాసనము మీద కూర్చొని ఉన్నాడు. కావాలనే నన్ను గుహలో పెట్టి రాజ్యాన్ని తీసుకున్నాడు. వీడిని ఎట్టి పరిస్థితులలోను ఆదరించకూడదు. రాజ్యం కోసమని అన్నని హత్య చెయ్యాలని ప్రయత్నం చేసినవాడు ' అన్నాడు.

 వాలి నన్ను కట్టుబట్టతో బయటకి తరిమేశాడు. అప్పుడు నేను భయపడుతూ బయటకి వచ్చాను. వాలి నన్ను వదిలిపెట్టకుండా చంపుతానని ఈ భూమండలం అంతా తరిమాడు. నేను ఈ భూమండలం అంతా పరిగెత్తాను. ఈ కొండమీదకి వాలి రాలేడు. చిట్టచివరికి నేను ఈ కొండ మీద కూర్చున్నాను. నాకు అత్యంత ప్రియమైన భార్య అయిన రుమని నేను బ్రతికి ఉండగా వాలి తన భార్యగా అనుభవిస్తున్నాడు. నేను చెయ్యని పాపానికి నన్ను కట్టుబట్టలతో బయటకి తోసేశాడు. నేను ఎంత చెప్పినా వినలేదు. పైగా నా భార్యని తన భార్యగా చేసుకున్నాడు. ఇంత కష్టంలో ఉన్నాను ............." అని సుగ్రీవుడు ఏడిచాడు.

  రాముడు " గ్రద్దల యొక్క ఈకలు కట్టినటువంటి, ఒంపులు లేనటువంటి బంగారు బాణములు నా అమ్ములపొదిలో ఉన్నాయి. నడువడి తెలియక పాపాత్ముడైన వాలి ఎంతకాలం నా కంటికి కనపడడో అంతకాలమే బ్రతికి ఉంటాడు. వాలి నాకు కనపడగానే మరణిస్తాడు. నువ్వు బెంగ పెట్టుకోవద్దు. ఎక్కడ ఉంటాడో నాకు చూపించు ఇప్పుడే సంహరిస్తాను. " అన్నాడు.

సముద్రాత్పశ్చిమాత్పూర్వం దక్షిణాదపి చోత్తరం |
క్రామత్యానుదితే సూర్యే వాలీ వ్యపగత క్లమః ||
 సుగ్రీవుడు " రామా ! తొందరపడవద్దు. నీకు ఒక విషయం చెబుతాను విను. సూర్యోదయానికి ముందరే వాలి నిద్రలేస్తాడు. తన అంతఃపురమునుంచి ఒక్కసారి ఎగిరి తూర్పు సముద్రతీరం దగ్గర దిగుతాడు. అక్కడ సంధ్యావందనం చేసి ఒకే దూకులో పశ్చిమసముద్రతీరం దగ్గర దిగుతాడు. అక్కడ సంధ్యావందనం చేసి ఒకే దూకులో ఉత్తరసముద్రతీరం దగ్గర దిగుతాడు. అక్కడ సంధ్యావందనం చేసి ఒకే దూకులో దక్షిణదిక్కుకి దూకుతాడు. ఇలా నాలుగు సముద్రాల దగ్గర సూర్యుడు ఉదయించేలోపు సంధ్యావందనము చేస్తాడు. దానితో పాటు నీకు ఇంకొక విషయం చెబుతాను " అని రాముడిని తీసుకువెళ్ళి ఒక పర్వతాన్ని చూపించి " ఈ పర్వతాలు వాటికి ఎంత పెద్ద శిఖరాలు ఉన్నాయో చూసావా! వాలి సంధ్యావందనం చేశాక ఇంటికి వెళ్ళి కొన్ని పాలు త్రాగి మళ్ళీ ఈ అరణ్యానికి వస్తాడు. ఇక్కడ ఉన్న ఈ పర్వతశిఖరాలని ఊపి విరగ్గొడతాడు. వాటిని గాలిలోకి విసిరి బంతులు పట్టుకున్నట్టు పట్టుకుంటాడు " అని చెప్పి రాముడిని మరొక్క ప్రదేశానికి తీసుకువెళ్ళి

" పూర్వం దుందుభి అని ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడికి ఒంట్లో బలం ఉందన్న పొగరు చేత ఒకరోజు సముద్రుడి దగ్గరికి వెళ్ళి తనతో యుద్ధం చెయ్యమన్నాడు. నీతో నాకు యుద్ధం ఏమిటి? నీ బలం ఎక్కడ నా బలం ఎక్కడ? నేను నీతో యుద్ధ చెయ్యలేను అని సముద్రుడు అన్నాడు. అప్పుడా దుందుభి ' నువ్వు నాతో యుద్ధం చెయ్యలేనంటే నేను నిన్ను వదలను. నాతో యుద్ధం చెయ్యగలిగిన వాడిని నాకు చూపించు ' అన్నాడు. అప్పుడా సముద్రుడు ' హిమవంతుడని ఉత్తరభారతదేశంలో ఒక పెద్ద పర్వతము ఉన్నది. అది మంచు పర్వతము. ఆయన కూతురు పార్వతీ దేవి. ఆ పార్వతీ దేవిని పరమశివుడికి ఇచ్చి వివాహము చేశారు. ఆయన మీద గొప్ప గొప్ప అరణ్యములు, గుహలు ఉన్నాయి. నువ్వు ఆ హిమవంతుడితో యుద్ధం చెయ్యి ' అన్నాడు.

 దుందుభి హిమవంత పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ పర్వత శిఖరాలని పీకేసి ముక్కలు చేస్తున్నాడు. దుందుభి చేస్తున్న అల్లరికి హిమవంతుడు పరుగు పరుగున వచ్చాడు.  దుందుభి హిమవంతుడిని యుద్ధానికి రమ్మన్నాడు, నాకు ఎవరితోనూ యుద్ధం చెయ్యాలని లేదు. నేను యుద్ధం చెయ్యను అని హిమవంతుడు అన్నాడు. దుందుభి ' నువ్వు కూడా ఇలా అంటే ఎలా? సముద్రుడు కూడా నీలాగే యుద్ధం చెయ్యనన్నాడు. పోనీ నాతో యుద్ధం చేసేవాడి పేరు చెప్పు ' అన్నాడు. అప్పుడు హిమవంతుడు ' నీ ఒంటి తీట తీర్చగలిగినవాడు కిష్కిందా రాజ్యాన్ని ఏలే వాలి ఉన్నాడు. మంచి బలవంతుడు. ఆయన నీతో యుద్ధం చేస్తాడు ' అని చెప్పాడు.

 దుందుభి సంతోషముగా కిష్కిందకి వెళ్ళి అక్కడున్న చెట్లని విరిచి ఆ కిష్కింద ద్వారాన్ని పగులగొట్టి పెద్ద అల్లరి చేశాడు. భార్యలతో కామమోహితుడై రమిస్తున్న వాలి ఈ అల్లరికి బయటకి వచ్చాడు. దుందుభి వాలిని చూసి ' ఛీ! భార్యలతో కామం అనుభవిస్తున్నావా! నా కోపాన్ని రేపటిదాకా ఆపుకుంటాను. నీ భార్యలతో కామం అనుభవించు. నువ్వు ఈ రాత్రి నీ భార్యలతో హాయిగా భోగం అనుభవించు. నీకు స్నేహితులైన వారిని పిలిచి వారికి కానుకలు ఇవ్వు. నీతో సమానమైన వాడికి పట్టాభిషేకము చెయ్యి. త్రాగి ఉన్నవాడిని, కామం అనుభవిస్తున్న వాడిని, అప్రమత్తంగా లేనివాడిని, యుద్ధం నుంచి పారిపోతున్నవాడిని, ఆయుధం లేనివాడిని చంపితే పసిపిల్లాడిని చంపిన పాపము వస్తుంది. అందుకని నేను నిన్ను వదిలేస్తున్నాను. ఎలాగోలా ఈ రాత్రికి ఇక్కడ కూర్చొని ఉంటాను. రేపు పొద్దున్న రా! నిన్ను చంపి అవతల పడేస్తాను ' అన్నాడు.

  వాలి ' నువ్వు నా గురించి అంతగా బెంగ పెట్టుకోవద్దు. నేను త్రాగి ఉన్నా అది వీరరసం త్రాగినవాడితో సమానము రా! యుద్ధానికి ' అని అడ్డువచ్చిన భార్యలని పక్కకు తోసేసి దుందుభి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఇంద్రుడు ఇచ్చిన మాలని వాలి తన మెడలో వేసుకుని దుందుభి తల మీద ఒక్క గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి దుందుభి ముక్కు నుండి చెవులనుండి నెత్తురు కారి కిందపడిపోయాడు. హోరాహోరుగా జరిగిన యుద్ధంలో వాలి దుందుభిని సంహరించి శరీరాన్ని గిరగిర తిప్పుతూ విసిరేశాడు. అప్పుడది గాలిలో యోజనదూరము ఎగురుకుంటూ వెళ్ళి మతంగమహర్షి ఆశ్రమము దగ్గర పడింది. అలా పడిపోవడములో ఆశ్రమము అంతా నెత్తురుతో తడిసిపోయింది. మతంగమహర్షి బయటకి వచ్చి దివ్యదృష్టితో చూసి ' ఎవడురా ఒళ్ళు కొవ్వెక్కి దుందుభి కళేబరాన్ని ఇటు విసిరినవాడు? ఈ శరీరాన్ని విసిరిన దౌర్భాగ్యుడు ఇక్కడికి వస్తే వాడి తల వెయ్యి వ్రక్కలయ్యి మరణిస్తాడు ' అని చెప్పి ' ఇక్కడ మీరందరూ మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. వాలికి సంబంధించినవాడు ఎవడైనా సరే ఇక్కడి చెట్లని పాడుచేస్తూ తిరిగితే రేపటి తరువాత వాళ్ళు మరణిస్తారని శపిస్తాను. నేను శపించే లోపల మీ అంతట మీరు ఇక్కడి నుండి వెళ్ళిపొండి ' అన్నాడు.

 అక్కడున్నటువంటి వానరాలు ఆ పర్వతాన్ని ఖాళీ చేసి వాలి దగ్గరికి పారిపోయి మతంగమహర్షి యొక్క శాపము గురించి వివరించారు. వాలి ఈ పర్వతము వైపు కనీసము చూడను కూడా చూడడు. నేను బ్రతకాలంటే ఈ బ్రహ్మాండంలో ఇది వాలి రాని ప్రదేశమని నేను ఇక్కడ ఉంటున్నాను. ఇంతకీ నేను నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకోచ్చానో తెలుసా? అదిగో అక్కడ ఎదురుగుండా కనపడుతున్న పెద్ద తెల్లటి పర్వతమే దుందుభి యొక్క కాయం. ఆ అస్థిపంజరం ఇప్పుడు పర్వతములా అయిపోయింది " అన్నాడు.

Thursday, 9 April 2020

Today Thidi Details

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
ఏప్రిల్ 10, 2020
శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్ర మాసం బహుళ పక్షం
తిధి :తదియ రా1.57 తదుపరి చవితి
వారం:శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం:విశాఖ రా2.10 తదుపరి అనూరాధ 
యోగం:వజ్రం ఉ9.30 తదుపరి సిద్ధి
కరణం:వణిజ మ3.04 తదుపరి భద్ర/విష్ఠి రా1.57 ఆ తదుపరి బవ
వర్జ్యం:ఉ8.53 - 10.23 &
తె5.59నుండి
దుర్ముహూర్తం :ఉ8.18 - 9.08 &
మ12.25 - 1.14
అమృతకాలం :సా5.54 - 7.24
రాహుకాలం: ఉ10.30 - 12.00
యమగండం/కేతుకాలం:మ3.00 - 4.30
సూర్యరాశి :మీనం
చంద్రరాశి   :తుల
సూర్యోదయం      :5.52
సూర్యాస్తమయం :6.10
సర్వే జనాః సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

Wednesday, 8 April 2020

Today Thidi Details

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
ఏప్రిల్  8, 2020
శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్ర మాసం శుక్ల పక్షం
తిధి:పౌర్ణమి ఉ8.50తదుపరి  బహుళ పాడ్యమి   
వారం:బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం:హస్త ఉ6.49 తదుపరి చిత్త తె5.12
యోగం: వ్యాఘాతం మ3.31 తదుపరి హర్షణ
కరణం: బవ ఉ8.50 తదుపరి బాలువ రా7.38 ఆ తదుపరి కౌలువ 
వర్జ్యం :మ2.16 - 3.45
దుర్ముహూర్తం  :ఉ11.36 - 12.26*       
అమృతకాలం  :రా11.13 - 12.43
రాహుకాలం: మ12.00 - 1.30
యమగండం/కేతుకాలం:ఉ7.30 - 9.00
సూర్యరాశి :మీనం
చంద్రరాశి   :కన్య
సూర్యోదయం      :5.53
సూర్యాస్తమయం :6.10 
సర్వే జనాః సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

Srimadramayana Pravachanamruthadhara -- 47

Srimadramayana Pravachanamruthadhara -- 47 By Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu

శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావా ! లోకము  యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో జ్ఞాపకము ఉన్నదా! ( ఎన్నో కష్టాలు పడి, ఎంతో గొప్పగా జీవించిన యయాతి చనిపోయాక స్వర్గానికి వెళ్ళాడు. దేవేంద్రుడు యయాతిని ఒక ప్రశ్న అడిగాడు." యయాతి! నీ రాజ్యంలో అసత్యము చెప్పని వాడు ఎవరు? " అని అడిగాడు. తాను ఎన్నడూ అసత్యము చెప్పలేదు కనుక ఆ యయాతి ఎంతో వినయంగా " నేను ఎన్నడూ అసత్యము పలకలేదు " అన్నాడు. " నీ వైపుకి చూపించి ఒక విషయాన్ని నీ అంతట నువ్వు పొగుడుకున్నావు కనుక నువ్వు మహా పాపత్ముడివి. అందుచేత నీకు స్వర్గలోక ప్రవేశము కుదరదు " అని చెప్పి దేవేంద్రుడు యయాతిని కిందకి తోసేశాడు.) జీవితకాలం కష్టపడిన యయాతి ఒక్క మాటకి అది కూడా దేవేంద్రుడు అడిగితే చెప్పిన జవాబుకి స్వర్గమునుండి పతనమై భూమి మీద పడిపోయాడు.

మన గురువుగారైన వశిష్ఠుడికి నూరుగురు కుమారులు జన్మించారు. ఒక్కడు కూడా భ్రష్టుడు కాదు. వాళ్ళు అందరూ తండ్రిమాట వినేవారే. అటువంటి నూరుగురు కుమారులు తండ్రిని గౌరవించి మాట్లాడిన పాపానికి ఒకే రోజు  శాపానికి గురై శరీరాలని వదిలేశారు. అంతకష్టమొచ్చినా మన గురువుగారు బెంగపెట్టుకోలేదు. మనం రోజూ చూసే ఎప్పటినుంచో ఉన్న భూమికి ఎంతో ఓర్పు ఉన్నది. ఎంతోమందిని భరిస్తుంది. ఒకప్పుడు  పాపభారాన్ని మొయ్యలేక అంత    గొప్ప భూమి కష్టమొచ్చి కదులుతుంది. ఆకాశములో ఉన్న సూర్యచంద్రులిద్దరు మహాబలము  కలిగినవారు. వాళ్ళిద్దరి చేత ఈ లోకములన్ని ప్రకాశిస్తున్నాయి. అటువంటి సూర్యచంద్రులని పాప గ్రహములైన రాహు కేతువులు గ్రహణ సమయంలో గ్రసిస్తున్నారు. మళ్ళీ  విడిచిపెడుతున్నారు. మనిషికి జీవితంలో కష్టం వచ్చిననాడు కష్టాన్ని తట్టుకొని నిలబడి, అప్పుడు కూడా ధర్మం విడిచిపెట్టకుండా ఉన్ననాడు కదా వాడిలో ఉన్నటువంటి సౌశీల్యం ప్రకాశించేది.  అన్నయ్యా! దయచేసి నీ కోపాన్ని విడిచిపెట్టు. నువ్వు జ్ఞానివి నీకు సమస్తం తెలుసు. నిప్పుని బూది కప్పినట్టు నీలో ఉన్న జ్ఞానాన్ని శోకము కప్పింది. నువ్వు కోపానికి వశుడవయ్యావు. నీకు చెప్పగలిగిన వాడిని అని నేను నీకు చెప్పడము లేదు. నేను కేవలము  నీ మీద కప్పబడ్డ శోకమనే దాన్ని తొలగించే ప్రయత్నము చేస్తున్నాను." అన్నాడు.

పూర్వజోఽప్యుక్త మాత్రస్తు లక్ష్మణేన సుభాషితమ్  |
సార గ్రాహీ మహాసారం ప్రతిజగ్రాహ రాఘవః ||
అవతలివారు చెప్పిన దానిలోని సారమును గ్రహించి తన స్వరూపమును దిద్దుకోగలిగిన గొప్ప శక్తి కలిగిన రాముడు, లక్ష్మణుడు చెప్పిన మాటలని విని తన కోపాన్ని విడిచిపెట్టి " తమ్ముడా! నువ్వు చెప్పిన మాట యదార్ధము. నన్ను అనుగమించి వచ్చిన సీత కనపడకపోతే నేను బ్రతకలేను. ఈ పర్వతగుహలలో ఎన్నో గుహలు, పొదలు ఉన్నాయి. సీత వాటిల్లో ఎక్కడన్నా ఉన్నదేమో వెతుకుదాము " అని రామలక్ష్మణులు ముందుకి బయలుదేరారు.
 ముందుకు వెళ్ళిన వాళ్ళకి ఒంటినిండా రక్తంతో తడిసిపోయి ముక్కుకి రక్తంతో రెక్కలు తెగిపోయి ఒక పక్కకి కూర్చుని ఉన్న జటాయువు కనపడింది.  రాముడు ' రాక్షస రూపములో ఉన్నవాడు ఈ పక్షి రూపాన్ని పొందాడు. నేను లక్ష్మణుడు వెళ్ళగానే సీతని ఈ పక్షే తినేసింది. దీనిని నేను నమ్మాను. ఇప్పుడిది నాకు ప్రమాదము తెచ్చింది. ఇప్పుడు నేను ఈ జటాయువు యొక్క శరీరాన్ని చీల్చేస్తాను' అని మనసులో అనుకొని కోదండములో బాణము  సంధించి జటాయువు వైపు పరుగులు తీశాడు.

 జటాయువు " రామా ! నువ్వు ఏ ఓషధిని గూర్చి ఈ అరణ్యములో వెతుకుతున్నావో ఆ ఓషధీ స్వరూపమైన సీతమ్మని, నా ప్రాణాలని పట్టుకుపోయినవాడు రావణాసురుడు. నువ్వు, లక్ష్మణుడు లేని సమయంలో రావణాసురుడు సీతమ్మని అపహరించి తీసుకుపోయాడు. సీతమ్మని అపహరిస్తుంటే రావణాసురిడితో యుద్ధం చేశాను. నా శక్తి మేర అడ్డుపడ్డాను. రావణుడి రథాన్ని, సారధిని, ధ్వజాన్ని పడగొట్టాను. వాడిని నిగ్రహించలేకపోయాను. ఆకాశమార్గములో సీతమ్మని ఎత్తుకుపోతూ ధూళిని, మేఘాల్ని సృష్టి చేశాడు. ఖడ్గంతో నా రెక్కలని కోసేశాడు. నా కాళ్ళు నరికేశాడు. నేను ఏమి చెయ్యలేకపోయాను. రామా ! నేను చచ్చిపోయాను. ఇంకొక్కసారి నన్ను చంపకు " అన్నాడు.

జటాయువు మాటలు విన్న రాముడు ఆ కోదండముతో పరిగెత్తుకుంటూ వెళ్ళి జటాయువుని గట్టిగా కౌగలించుకుని ఏడిచాడు. ఆయన అలా ఏడుస్తున్నప్పుడు ఆ కోదండము  చేతినుండి విడిపోయి కింద పడిపోయింది. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా జటాయువు మీద పడి ఏడిచాడు.

రాజ్యాద్భ్రంశో వనేవాసః సీతా నష్టా ద్విజో హతః |
ఈదృశీయం మమాలక్ష్మీః నిర్దహేదపి పావకమ్  ||
 రాముడు " నాకు రాజ్యం పోయింది. అరణ్యానికి వచ్చాను. సీతని పోగొట్టుకున్నాను. నమ్మిన స్నేహితుడైన జటాయువు మరణిస్తున్నాడు. ఇవ్వాళ నేను పొందుతున్న శోకానికి అగ్నిని తీసుకొచ్చి అక్కడ పెడితే ఆ అగ్నిని నా శోకం కాల్చేస్తుంది. అంత శోకంలో నేను ఉన్నాను లక్ష్మణా! " అన్నాడు. " జటాయు! నాకోసం నువ్వు ఇంత కష్టపడ్డావు. ఒక్కసారి చెప్పు ఆ రావణుడు ఎక్కడ ఉంటాడు?  అతని పౌరుష పరాక్రమాలు ఎటువంటివి?  సీతని ఎటువైపుకి తీసుకెళ్ళాడు? ఏ రాజ్యాన్ని పరిపాలిస్తాడు? అతని స్వరూపము ఏమిటి?  నాకు చెప్పు " అన్నాడు.

 జటాయువు " ఆ రావణుడు సీతమ్మని అపహరించి సీతమ్మని తన ఒడిలో కూర్చోపెట్టుకుని, ఆకాశమార్గములో దక్షిణ దిక్కుకి తీసుకెళ్ళిపోయాడు. ఇంతకన్నా చెప్పాలని ఉన్నది. నా రెక్కలు తెగిపోవడము వలన నా కళ్ళు కనపడడము  మానేశాయి. నా నోటి వెంట మాట రావడము లేదు. నువ్వు మాట్లాడుతున్నది వినపడడం లేదు. నాలో  ఉన్న భావములను  చెప్పగలుగుతున్నానో, చెప్పలేకపోతున్నానో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అన్నిటినీ మించి ఈ అరణ్యము అంతా నాకు బంగారముగా కనపడుతుంది. వింద అనే ముహూర్తంలో రావణుడు దొంగిలించాడు. నీ వస్తువు నీకు దొరుకుతుంది. ఆ ముహూర్తంలో దొంగలించబడ్డ వస్తువుని తిరిగి యజమాని పొందుతాడు. నువ్వు సీతమ్మని పొందుతావు. మీ ఇద్దరికీ పట్టాభిషేకము అవుతుంది. నువ్వు చాలా కాలము రాజ్యపాలన చేస్తావు " అని చెబుతుండగా ఆయన నోటినుండి రక్తంతో కూడిన మాంసం ముద్దని కక్కి తన చిట్టచివర ప్రాణాలని కూడా లాగి "  రావణాసురుడి తండ్రి విశ్రవసో బ్రహ్మ. ఆయన తమ్ముడు కుబేరుడు....." అని చెప్పి శిరస్సు పక్కకి పడిపోగా ఆ జటాయువు మరణించాడు.

  రాముడు " చూశావా లక్ష్మణా! రావణుడు సీతని బలవంతంగా అపహరించుకుపోతుంటే తన ప్రాణాలను అడ్డుపెట్టి ఈ పక్షి సీతని కాపాడే ప్రయత్నము చేసింది. మనం ఆలోచించి చూస్తే, ధర్మాన్ని పాటించేవారు, శూరులైనవారు, శరణాగతి చేసినవారిని రక్షించేవారు మనుష్యులలోనే కాదు, జంతువులలో కూడా ఉన్నారు. సీతని అపహరించారన్న సంగతి తెలుసుకున్నప్పుడు నేను పొందిన దుఖం కన్నా, ఒక పక్షి నాకు ఉపకారం చెయ్యడము కోసమని తన ప్రాణాలు వదిలేసిందని తెలుసుకొని నేను ఇవ్వాళ ఎక్కువ దుఖం పొందుతున్నాను. నాయనా లక్ష్మణా! దశరథ మహారాజు మనకి ఎలా గౌరవించ వలసినవాడో, ఆయనకి స్నేహితుడైన జటాయువు కూడా మనకి గౌరవించ వలసినవాడు. ఆనాడు నేను తండ్రిగారికి ఎలా అంత్యేష్టి సంస్కారము  చేశానో జటాయువుకి ఇవ్వాళ అలా చెయ్యాలని అనుకుంటున్నాను.

   లక్ష్మణా! అక్కడ ఏనుగులు చెట్లని ఒరుసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ చెట్ల యొక్క ఎండుకర్రలు కిందపడతాయి. నువ్వు వెళ్ళి ఆ కర్రలని పట్టుకురా.  మనం ఈ జటాయువు శరీరాన్ని చితి మీద పెడదాము. ఆయన శరీరాన్ని అగ్నిలో కాల్చాక రోహి మాంసాన్ని పిండంగా పెడదాము " అన్నాడు. (రోహి అనేది ఒక మృగం పేరు జటాయువు మాంసం తింటాడు కనుక ఆయనకి ఆ మృగ మాంసంతో పిండం పెట్టారు).

 జటాయువుకి పిండాలు పెట్టాక గోదావరినదికి వెళ్ళి ఉదకక్రియలు చేసి " నాచేత సంస్కరింపబడుతున్న ఓ జటాయువా! నేను నీకు అనుజ్ఞ ఇస్తున్నాను. నీకు ఇష్టము వచ్చిన ఉత్తమలోకాలకి వెళ్ళు" అని రాముడు అన్నాడు. తరువాత నదిలో జలతర్పణ చేశారు.

జటాయువు ఉత్తమలోకాలని పొందాడని వాల్మీకి మహర్షి చెప్పారు.

  రామలక్ష్మణులు అక్కడినుంచి బయలుదేరి క్రౌంచారణ్యంలోకి ప్రవేశించారు. అతి భయంకరంగా ఉండే ఆ క్రౌంచారణ్యాన్ని రామలక్ష్మణులు దాటి కొంత దూరం వెళ్ళాక ఒక చీకటిగుహ కనబడింది. ఆ చీకటిగుహ దగ్గర అలికిడి చప్పుడు వినబడ్డాయి. అంతలోనే ఎక్కడినుంచో ఒక భయంకరమైన రాక్షస స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె పేరు అయోముఖి. కడుపు కిందకి జారిపోయి వికృతమైన రూపంతో ఉన్న ఆ అయోముఖికి లక్ష్మణుడి మీద వ్యామోహం పుట్టింది. అప్పుడామె పరుగు పరుగున వచ్చి లక్ష్మణుడిని పట్టుకొని " నువ్వు చాలా బాగున్నావు. మంచి యవ్వనంలో ఉన్నావు. మనిద్దరము ఈ పర్వాతాల మీద తిరుగుతూ క్రీడిద్దాము " అన్నది.

లక్ష్మణుడు వెంటనే తన ఖడ్గాన్ని తీసి ఆవిడ ముక్కుని, చెవులని, స్తనాలని నరికేశాడు. అయోముఖి నెత్తురు కారుతుండగా ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ ఆ గుహలోకి పారిపోయింది.

  వారు అక్కడినుండి కొంతదూరం ప్రయాణించాక లక్ష్మణుడు రాముడితో ఇలా    " అన్నయ్యా! చాలా దుర్నిమిత్తాలు కనపడుతున్నాయి. ఏదో తీవ్రమైన భయం వేస్తుంది. ఇక్కడ మంజులతం అనే పక్షి కూస్తోంది, ఈ పక్షి కూత ఎవరికి వినపడుతుందో వారికి జయం కలుగుతుంది.  పరమ దారుణమైన యుద్ధం జరుగుతుంది" అని చెపుతుండగా ఒక పెద్ద శబ్దం వినపడింది. రామలక్ష్మణులు చూసేసరికి సృష్టిలో కనీ వినీ ఎరుగనటువంటి రూపం వాళ్ళకి కనపడింది. దానికి తలకాయ, కాళ్ళు లేవు. కేవలం గుండెల దగ్గరినుంచి నడుము కిందభాగం వరకు మాత్రమే దాని శరీరం ఉన్నది. అందులోనే ఒక పెద్ద నోరు, కన్ను ఉన్నాయి. ఆ కన్ను దూరంగా ఉన్న వస్తువులనికూడా చూస్తుంది. దానికి యోజనము పొడవున్న చేతులు ఉన్నాయి. అది నడవలేదు కనుక ఆ చేతులతో అడవిలో తడిమి దొరికిన దాన్ని తిని బతుకుతుంది. ఆ వింతస్వరూపాన్ని చూసి అసలు ఇదేమిటిరా ఇలా ఉన్నదని వాళ్ళు అనుకుంటున్నారు. ఇంతలోనే అది తన రెండు చేతులతో రామలక్ష్మణులను పట్టుకున్నది. అప్పుడది " నేను రాక్షసుడిని నన్ను కబంధుడని అంటారు. అరణ్యానికి వచ్చి ఇటువైపునకు ఎందుకు వచ్చారు? ఇప్పుడు నేను మీ ఇద్దరినీ తినేస్తాను " అని అంటూ వాళ్ళని దగ్గరిగా తీసుకునే ప్రయత్నంలో ఉండగా లక్ష్మణుడు రాముడితో " మనం వీడిని ఉపేక్షిస్తే వీడు మనిద్దరినీ మింగేస్తాడు. వీడి చేతులని ఖండించేద్దాము " అన్నాడు.

  లక్ష్మణుడు ఎడమ బాహువుని, రాముడు కుడి బాహువుని నరికేశారు.  కబంధుడు " మీరు ఇద్దరు ఎవరు? " అని అడిగాడు.

లక్ష్మణుడు " ఈయన రాముడు  దశరరథుడి కుమారుడు. తండ్రి మాటకి కట్టుబడి పదునాలుగు సంవత్సరాలు అరణ్యవాసమునకు వచ్చాడు. ఈయన భార్య అయిన సీతమ్మని ఎవరో అపహరించారు. సీతమ్మని వెతుక్కుంటూ మేము ఈ మార్గంలో వచ్చాము. అసలు నువ్వు ఎవరు? నువ్వు ఇలా ఉన్నవేమిటి? నీలాంటి రాక్షసుడిని మేము ఎప్పుడూ చూడలేద" ని అన్నాడు.

  కబంధుడు " నేను మీకు నా కథ చెబుతాను. కాని మీరు నాకు ఒక ఉపకారం చెయ్యాలి. ఒక చితి పేర్చి దానిమీద నన్ను పడుకోబెట్టి కాల్చెయ్యండి " అన్నాడు. " సరే నువ్వు కోరినట్టే నిన్ను కాల్చేస్తాము. సీతమ్మని ఎవరో రాక్షసుడు అపహరించాడు. నువ్వు రాక్షసుడివి కదా! నీకేమన్నా తెలుసా? " అని రామలక్ష్మణులు అడిగారు.

  కబంధుడు " మీకు ఆ విషయాన్ని ఈ శరీరముతో చెప్పలేను. నన్ను కాల్చేస్తే, నాకు నా పూర్వ శరీరము వచ్చేస్తుంది. అప్పుడు ఆ శరీరముతో చెబుతాను. ఈ శరీరానికి అన్నీ జ్ఞాపకము లేవు. ఆ శరీరానికి అన్నీ తెలుసు. నన్ను కాల్చెయ్యండి " అన్నాడు.

" కాలుస్తాము కాని నువ్వు అసలు ఎవరు? ఇలా ఎందుకు ఉన్నావు?" అని రామలక్ష్మణులు అడిగారు.

  కబంధుడు " పూర్వకాలంలో నేను ఎంతో గొప్ప తేజస్సుతో ఉండేవాడిని. నా పేరు ధనువు. సూర్యుడు ఎలా ఉంటాడో, చంద్రుడు ఎలా ఉంటాడో, ఇంద్రుడు ఎలా ఉంటాడో నాకూ అటువంటి శరీరము ఉండేది. నా స్వరూపాన్ని చూసి అందరూ పొంగిపోయేవారు. అందమైన శరీరంతో ఉన్న నాకు నేను కామరూపిని కనుక ఒక విచిత్రమైన స్వరూపాన్ని పొంది అరణ్యములోకి వెళ్ళి అందరినీ భయపెడితే ఎలా ఉంటుంది ' అని ఒక దిక్కుమాలిన ఆలోచన వచ్చింది. ' అప్పుడు నేను వెంటనే ఒక వికృతస్వరూపాన్ని పొంది అరణ్యములోకి వెళ్ళాను. అక్కడ స్థూలశిరుడు అనే మహర్షి దర్భలు ఏరుకుంటూ ఉండగా నేను ఆయన వెనకాలకి వెళ్ళి ఒక పెద్ద కేక వేశాను. అప్పుడా మహర్షి నా వంక చూసి ' ఇలా ఈ రూపంతో తిరగడము నీకు ఎంత సరదాగా ఉన్నదో, నువ్వు ఇలాగే చాలా కాలము ఇక్కడ తిరుగుతూ ఉండు' అని వెళ్ళిపోయారు. నేను నా నిజస్వరూపాన్ని పొంది ఆయన కాళ్ళ మీద పడి ' మీరు చెప్పిన మాట ప్రకారము నాకు ఆ భయంకరమైన స్వరూపము తొందరలో వస్తుంది. మళ్ళీ నాకు ఆ స్వరూపము ఎలా పోతుంది?' అని అడిగాను. అప్పుడా స్థూలశిర మహర్షి అన్నాడు ' నీకు వచ్చిన ఈ ప్రకోపము పోవాలి. కొంతకాలానికి ఇక్కడికి రామలక్ష్మణులు వచ్చి నీ రెండుచేతులు నరికేస్తారు. అప్పుడు నీకు శాపవిమోచనమవుతుంద' ని చెప్పారు.

  నేను వెంటనే వెళ్ళి తపస్సు చెయ్యడము ప్రారంభించాను. కొంతకాలానికి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యి ' ఏమి కావాలి? ' అని అడిగారు. నేను ' నాకు దీర్ఘాయువు కావాలి ' అని అడిగాను. బ్రహ్మగారు తథాస్తని చెప్పి వెళ్ళిపోయారు. నాకు దీర్ఘాయుర్దాయము ఉన్నదన్న అహంకారముతో ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళాను. ఇంద్రుడు నూరు అంచులు ఉన్న వజ్రాయుధాన్ని నా మీద ప్రయోగించాడు. వజ్రాయుధం నా రెండు కాళ్ళని ఛాతిలోకి నొక్కేసింది. అలాగే నా తలని కూడా ఛాతిలోకి నొక్కేసింది. నా రెండుచేతులని కూడా లోపలికి నొక్కేసింది. నేను అప్పుడు నడుము నుంచి ఛాతి వరకూ ఉన్న శరీరముతో కిందపడ్డాను.

 నేను ఇంద్రుడితో ' నువ్వు నన్ను కొట్టేశావు బాగానే ఉన్నది. నా చేతులు, కాళ్ళు లోపలికి తోసేశావు. నాకు బ్రహ్మగారు దీర్ఘ ఆయుర్దాయము ఉన్నదని వరమిచ్చారు. ఇప్పుడు నా నోరు లోపలికి వెళ్ళింది కదా! మరి నేను ఏమి తిని బతకను? ' అని ఇంద్రుడిని అడిగాను. ఇంద్రుడు నా కన్నుని, నోరుని నా ఉదరభాగము మీద ఏర్పాటు చేసి యోజనము పొడువున్న రెండు చేతులు ఇచ్చాడు.

రామా ! నేను అప్పటినుండి నేను ఇలా పడి ఉన్నాను. ఈ అరణ్యములో తడుముకుంటూ దొరికినది తింటూ ఉంటాను. ఎప్పటినుంచో రామలక్ష్మణులు దొరికితే బాగుండు అనుకుంటున్నాను. ఇప్పటికి మీరు దొరికారు. మీరు నా శరీరాన్ని కాల్చెయ్యండి నేను మీకు ఉపకారం చేస్తాను " అన్నాడు.
( మనకి ఉన్న ఒకే ఒక్క సుగుణమునుండి అహంకారం అనే భూతం వస్తుంది. ఒకడికి అందం ఉందని, ఒకడికి డబ్బు ఉందని, ఒకడికి అధికారం ఉందని, ఒకడికి చదువు ఉందని, ఒకడికి తెలివి ఉందని అహంకరిస్తుంటారు. మనకి ఉన్నదానిని పదిమందికి ఉపయోగపడే విధంగా బతుకుదామని ఉండదు. ఇదే కబంధుడి జీవితమునుంచి మనం నేర్చుకోవలసింది)

  వాళ్ళు కబంధుడి శరీరాన్ని చితి మీద పెట్టి కాల్చేశారు. అప్పుడు ఆ చితి నుండి ఆభరణములు పెట్టుకుని, మంచి తేజస్సుతో, ఒక దివ్య శరీరముతో ధనువు పైకి వచ్చి " రామా ! ఇప్పుడు నీకు చాలా కష్టమైన కాలము నడుస్తుంది. నీలాగే భార్యని పోగొట్టుకుని బాధపడుతున్నవాడు ఒకడు ఉన్నాడు. ఆయన కూడా ధర్మాత్ముడు. ఆయన పేరు సుగ్రీవుడు. నలుగురు వానరములతో కలిసి ఋష్యమూక పర్వతము మీద ఉన్నాడు. ఆయనని అన్నగారైన వాలి రాజ్యం నుండి వెడలగొట్టాడు. ఋక్షరజస్సు అనే వానరుని భార్యకి సూర్యుడి తేజస్సు వల్ల సుగ్రీవుడు ఔరసపుత్రుడిగా జన్మించాడు. నువ్వు ఆయనతో అగ్నిసాక్షిగా స్నేహం చేసుకో. వానరుడు కదా అని ఎన్నడూ సుగ్రీవుడిని అవమానించద్దు. ఇప్పుడు నీకు ఒక గొప్ప మిత్రుడు కావాలి. సుగ్రీవుడు నీకు తగిన మిత్రుడు. ఆ సుగ్రీవుడిని కలుసుకోవడానికి నువ్వు ఇక్కడినుంచి పశ్చిమదిక్కుకి వెళ్ళు. అక్కడ అనేకమైన వృక్ష సమూహములు కనపడతాయి. ఆ వృక్షములకు ఉండే పళ్ళు సామాన్యమైనవి కావు. అవి చాలా మధురంగా ఉంటాయి. మీరు ఆ పళ్ళు తిని ముందుకి వెళితే కొన్ని వనములు వస్తాయి. మీరు ఆ వనములన్నీ దాటి ముందుకి వెళితే ఆఖరికి పంపా అనే పద్మసరస్సు వస్తుంది. ఆ సరస్సు దగ్గర హంసలు, ప్లవములు, క్రౌంచములు, కురరవములు అనే పక్షులు నేతిముద్దల్లా ఉంటాయి. మీరు ఆ పక్షులని చంపి వాటి మాంసాన్ని తినండి. అలా చెయ్యడము  వల్ల మీరు సేద తీరుతారు. ఆ సరస్సులో రుచికరమైన చేపలు ఉంటాయి. మీరు వాటిని కూడా తినండి. సుగంధ భరితమై, నిర్మలమై, చల్లగా ఉండేటటువంటి ఆ సరస్సులోని నీటిని త్రాగండి. మీరు సాయంత్రము పూట అక్కడ విహరించండి.   మీకొక విచిత్రమైన విషయము కనపడుతుంది. అక్కడ వాడని పూలదండలు పడి ఉంటాయి. ఆ పూలదండలని ఎవరూ వేసుకోరు.

  రామా! ఈ పూలదండలు ఎలా వచ్చాయో తెలుసా ? పూర్వం మతంగమహర్షి ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆయనకి కావలసిన దర్భలు, ఇతర పదార్ధాలు అరణ్యమునుండి మూట కట్టి తీసుకెళ్ళేవారు. వారు అలా తీసుకెళుతున్నప్పుడు వారి ఒంటికి చెమట పట్టి, ఆ చెమట బిందువులు భూమిమీద పడ్డాయి. వారు  ఎంతో గురు శుశ్రూష చేసినవారు. వాళ్ళ చెమటబిందువులు భూమిమీద పడగానే పూలదండలుగా మారిపోయాయి. ఆ పూలదండలు ఇప్పటికీ వాడకుండా అలానే ఉన్నాయి. నువ్వు ఆ పూలదండలని చూసి సంతోషించు. ఆ పంపాసరోవరానికి ముందరే ఋష్యమూక పర్వతము కనపడుతుంది.

ఆ ఋష్యమూక పర్వతాన్ని పూర్వకాలములో బ్రహ్మగారు నిర్మించారు. దానిని ఎక్కడము చాలా కష్టం. చిత్రమేమిటంటే ఆ పర్వతాన్ని గున్నఏనుగులు రక్షిస్తుంటాయి. ఆ గున్నఏనుగులు రోజూ పంపాసరోవరం దగ్గరికి గుంపులుగా వచ్చి నీళ్ళు త్రాగుతాయి. దాహం తీరిపోగానే పౌరుషము వచ్చి ఆ ఏనుగులన్నీ నోట్లోనుంచి నెత్తురు కారేటట్టుగా కొట్టుకుంటాయి. అంతగా కొట్టుకున్నాక అవి స్నేహితులు చెయ్యి చెయ్యి కలుపుకొని వెళ్ళినట్టు తొండాలు తొండాలు ముడివేసుకొని ఆ ఋష్యమూక పర్వతము చుట్టూ తిరుగుతాయి. ఆ ఋష్యమూక పర్వతశిఖరము మీద ఎవరన్నా ఒక రాత్రి పడుకుంటే ఆ రాత్రి వారికి కలలో ఏది కనపడుతుందో ఉదయానికల్లా అది జరిగి తీరుతుంది. పాపకర్మ, దుష్టబుద్ధి ఉన్నవాడు ఆ పర్వతాన్ని ఎక్కలేడు. ఆ పర్వతాల మీద ఐదు వానరాలు ఉన్నాయి. ఆ పర్వతము మీదకి వెళితే ఒక పెద్దగుహ ఉంటుంది. దానిని ఒక రాతి పలకతో మూసి ఉంచుతారు. ఆ గుహలోకి ఎవరూ ప్రవేశించలేరు. దాని పక్కనే ఒక పెద్దతోట ఉంటుంది. అందులో అన్ని ఫలాలు లభిస్తాయి. ఆ ఫలాలని తింటూ అక్కడే ఉన్న సరస్సులోని నీళ్ళు త్రాగుతూ సుగ్రీవుడు ఆ గుహలో కూర్చొని ఉంటాడు.

ఆ సుగ్రీవుడు అప్పుడప్పుడూ గుహనుండి బయటకి వచ్చి ఆ పర్వతశిఖరాల మీద ఒక పెద్ద బండరాయి మీద కూర్చుంటూ ఉంటాడు. గుర్తుపెట్టుకో రామా! ఆ సుగ్రీవుడికి సూర్యకిరణాలు ఎంత దూరమువరకూ భూమి మీద పడతాయో, అంతవరకు ఏ పర్వతాలు ఉన్నాయో, ఎన్ని గుహలు ఉన్నాయో, ఆ గుహలలో ఎవరు ఉంటారో, ఎవరు ఎక్కడ ఉంటారో, ఎక్కడ పాలిస్తారో, వారి వంశము ఏమిటో అన్నీ తెలుసు. అటువంటి సుగ్రీవుడితో స్నేహము చెయ్యి " అని చెప్పి వెళ్ళిపోయాడు.

 రామలక్ష్మణులు బయలుదేరి మతంగమహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు.  మతంగమహర్షి యొక్క శిష్యురాలైన శబరి రామలక్ష్మణులను చూసి గబగబా బయటకి వచ్చి వారి పాదములను గట్టిగా పట్టుకుంది. వారికి అర్ఘ్యము, పాద్యము మొదలైనటువంటి అతిథికి ఇవ్వవలసిన సమస్త సంభారములు చేకూర్చింది. అవన్నీ స్వీకరించాక రాముడు శబరితో " నువ్వు నియమముగా జీవితము  గడపగలుగుతున్నావా ! నియమముతో కూడిన ఆహారాన్ని తీసుకుంటున్నావా! తపస్సు చెయ్యగలుగుతున్నావా ! నీ గురువుల యొక్క అనుగ్రహాన్ని నిలబెట్టుకుంటున్నావా? " అని అడిగాడు.
  శబరి " రామా ! ఏనాడు నీ దర్శనము చేశానో, ఆనాడే నా తపస్సు సిద్ధించింది. నేను కూడా మా గురువుగారైన మతంగమహర్షి శిష్యులతో పాటు తపస్సు చేశాను. నువ్వు చిత్రకూటపర్వతముమీద ఉండగా మా గురువులందరూ దివ్యమైన విమానములు ఎక్కి ఉత్తమలోకములకు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతూ నాతో ఒకమాట అన్నారు ' మహానుభావుడైన రామచంద్రమూర్తి ఈ ఆశ్రమము వైపుకి వస్తారు. వాళ్ళకి ఆతిధ్యము ఇచ్చాక నువ్వుకూడా మేము ఉన్నటువంటి ప్రదేశానికి రమ్మ ' ని చెప్పి వెళ్ళారు. నీకోసము నేను ఇక్కడే ఉండిపోయాన " ని చెప్పింది.

 రాముడు శబరితో " నీ యొక్క ప్రభావాన్ని నేను చూడాలి అనుకుంటున్నాను శబరి " అన్నాడు.

 శబరి రాముడిని ఆ ఆశ్రమము లోపలికి తీసుకువెళ్ళి ఒక అగ్నివేదిని చూపించి " రామా! మా గురువుగారు ఈ అగ్నివేది దగ్గరే అగ్నిహోత్రము చేసేవారు. వృద్ధులైన మా గురువులు వొణికిపోతున్న చేతులతో పువ్వులు తీసి ఆ వేదిమీద పెట్టేవారు. రామా! ఒక్కసారి ఆ వేదిమీద చూడు. ఆ పువ్వులు ఇప్పటికీ వాడకుండా అలానే ఉన్నాయి. నువ్వు చిత్రకూట పర్వతముమీద ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ అగ్నికార్యము చేసి వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఆ అగ్నివేదిలోనుంచి వచ్చే కాంతి దశదిశలని ప్రకాశింప చేస్తుంది. మా గురువులు చాలా వృద్ధులు అవ్వడము  వలన నదీతీరానికి వెళ్ళి స్నానము చెయ్యలేకపోయేవారు. వారు అక్కడే కూర్చొని ఒక్క నమస్కారము చేసేవారు. వారు అలా నమస్కారము చెయ్యగానే ఏడు సముద్రముల యొక్క పాయలు ఇటుగా ప్రవహించాయి. మా గురువులు అందులో స్నానము చేసారు. మా గురువులు స్నానం చేసి తమ వస్త్రములను పిండి ఇక్కడే తీగలమీద ఆరవేసేవారు. నువ్వు ఆ వస్త్రములను ముట్టుకొని చూడు అవి ఇప్పటికీ అలానే తడిగా ఉంటాయి. వారు ముట్టుకున్న ప్రతి వస్తువుని వారు ఏ స్థితిలో ముట్టుకున్నారో అవి ఆ స్థితిలోనే ఉండిపోయాయి తప్ప ప్రకృతి యొక్క పరిణామగతంగా ఆ వస్తువులు మారలేదు. వారు అంతగా ఆత్మగతులై ఆత్మస్వరూపముగా ఉండిపోయారు.

రామా ! నీకోసమని చెప్పి నేను ఈ అరణ్యమునుండి చాలా సంభారములని సేకరించాను. నువ్వు వాటిని స్వీకరించ" ని చెప్పి, ఆ సంభారములని రాముడికి ఇచ్చి " మా గురువులు నీకు ఆతిధ్యము ఇవ్వమన్నారు నేను ఇచ్చాను. ఇంక  నేను వెళ్ళిపోదామని అనుకుంటున్నాన " ని చెప్పి, సంకల్పమాత్రము చేత అగ్నిని రగిల్చి అందులో చీర క్రిష్ణాజీనాంబరములతో సహా దూకి తన శరీరాన్ని వదిలేసింది. ఆ అగ్నిలోనుంచి దివ్యమైన అంబరములతో, దివ్యమైన వస్త్రములతో ఆమె శరీరం బయటకి వచ్చి తన గురువులు ఉన్న లోకాలకి వెళ్ళిపోయింది.

ఆహా! ఏమి ఋషులు! ఏమి తపస్సు! అని రామలక్ష్మణులు పొంగిపోయి అక్కడినుండి బయలుదేరి ఋష్యమూక పర్వతము వైపు బయలుదేరారు.