Srimadramayana Pravachanamruthadhara -- 47 By Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu
శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావా ! లోకము యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో జ్ఞాపకము ఉన్నదా! ( ఎన్నో కష్టాలు పడి, ఎంతో గొప్పగా జీవించిన యయాతి చనిపోయాక స్వర్గానికి వెళ్ళాడు. దేవేంద్రుడు యయాతిని ఒక ప్రశ్న అడిగాడు." యయాతి! నీ రాజ్యంలో అసత్యము చెప్పని వాడు ఎవరు? " అని అడిగాడు. తాను ఎన్నడూ అసత్యము చెప్పలేదు కనుక ఆ యయాతి ఎంతో వినయంగా " నేను ఎన్నడూ అసత్యము పలకలేదు " అన్నాడు. " నీ వైపుకి చూపించి ఒక విషయాన్ని నీ అంతట నువ్వు పొగుడుకున్నావు కనుక నువ్వు మహా పాపత్ముడివి. అందుచేత నీకు స్వర్గలోక ప్రవేశము కుదరదు " అని చెప్పి దేవేంద్రుడు యయాతిని కిందకి తోసేశాడు.) జీవితకాలం కష్టపడిన యయాతి ఒక్క మాటకి అది కూడా దేవేంద్రుడు అడిగితే చెప్పిన జవాబుకి స్వర్గమునుండి పతనమై భూమి మీద పడిపోయాడు.
మన గురువుగారైన వశిష్ఠుడికి నూరుగురు కుమారులు జన్మించారు. ఒక్కడు కూడా భ్రష్టుడు కాదు. వాళ్ళు అందరూ తండ్రిమాట వినేవారే. అటువంటి నూరుగురు కుమారులు తండ్రిని గౌరవించి మాట్లాడిన పాపానికి ఒకే రోజు శాపానికి గురై శరీరాలని వదిలేశారు. అంతకష్టమొచ్చినా మన గురువుగారు బెంగపెట్టుకోలేదు. మనం రోజూ చూసే ఎప్పటినుంచో ఉన్న భూమికి ఎంతో ఓర్పు ఉన్నది. ఎంతోమందిని భరిస్తుంది. ఒకప్పుడు పాపభారాన్ని మొయ్యలేక అంత గొప్ప భూమి కష్టమొచ్చి కదులుతుంది. ఆకాశములో ఉన్న సూర్యచంద్రులిద్దరు మహాబలము కలిగినవారు. వాళ్ళిద్దరి చేత ఈ లోకములన్ని ప్రకాశిస్తున్నాయి. అటువంటి సూర్యచంద్రులని పాప గ్రహములైన రాహు కేతువులు గ్రహణ సమయంలో గ్రసిస్తున్నారు. మళ్ళీ విడిచిపెడుతున్నారు. మనిషికి జీవితంలో కష్టం వచ్చిననాడు కష్టాన్ని తట్టుకొని నిలబడి, అప్పుడు కూడా ధర్మం విడిచిపెట్టకుండా ఉన్ననాడు కదా వాడిలో ఉన్నటువంటి సౌశీల్యం ప్రకాశించేది. అన్నయ్యా! దయచేసి నీ కోపాన్ని విడిచిపెట్టు. నువ్వు జ్ఞానివి నీకు సమస్తం తెలుసు. నిప్పుని బూది కప్పినట్టు నీలో ఉన్న జ్ఞానాన్ని శోకము కప్పింది. నువ్వు కోపానికి వశుడవయ్యావు. నీకు చెప్పగలిగిన వాడిని అని నేను నీకు చెప్పడము లేదు. నేను కేవలము నీ మీద కప్పబడ్డ శోకమనే దాన్ని తొలగించే ప్రయత్నము చేస్తున్నాను." అన్నాడు.
పూర్వజోఽప్యుక్త మాత్రస్తు లక్ష్మణేన సుభాషితమ్ |
సార గ్రాహీ మహాసారం ప్రతిజగ్రాహ రాఘవః ||
అవతలివారు చెప్పిన దానిలోని సారమును గ్రహించి తన స్వరూపమును దిద్దుకోగలిగిన గొప్ప శక్తి కలిగిన రాముడు, లక్ష్మణుడు చెప్పిన మాటలని విని తన కోపాన్ని విడిచిపెట్టి " తమ్ముడా! నువ్వు చెప్పిన మాట యదార్ధము. నన్ను అనుగమించి వచ్చిన సీత కనపడకపోతే నేను బ్రతకలేను. ఈ పర్వతగుహలలో ఎన్నో గుహలు, పొదలు ఉన్నాయి. సీత వాటిల్లో ఎక్కడన్నా ఉన్నదేమో వెతుకుదాము " అని రామలక్ష్మణులు ముందుకి బయలుదేరారు.
ముందుకు వెళ్ళిన వాళ్ళకి ఒంటినిండా రక్తంతో తడిసిపోయి ముక్కుకి రక్తంతో రెక్కలు తెగిపోయి ఒక పక్కకి కూర్చుని ఉన్న జటాయువు కనపడింది. రాముడు ' రాక్షస రూపములో ఉన్నవాడు ఈ పక్షి రూపాన్ని పొందాడు. నేను లక్ష్మణుడు వెళ్ళగానే సీతని ఈ పక్షే తినేసింది. దీనిని నేను నమ్మాను. ఇప్పుడిది నాకు ప్రమాదము తెచ్చింది. ఇప్పుడు నేను ఈ జటాయువు యొక్క శరీరాన్ని చీల్చేస్తాను' అని మనసులో అనుకొని కోదండములో బాణము సంధించి జటాయువు వైపు పరుగులు తీశాడు.
జటాయువు " రామా ! నువ్వు ఏ ఓషధిని గూర్చి ఈ అరణ్యములో వెతుకుతున్నావో ఆ ఓషధీ స్వరూపమైన సీతమ్మని, నా ప్రాణాలని పట్టుకుపోయినవాడు రావణాసురుడు. నువ్వు, లక్ష్మణుడు లేని సమయంలో రావణాసురుడు సీతమ్మని అపహరించి తీసుకుపోయాడు. సీతమ్మని అపహరిస్తుంటే రావణాసురిడితో యుద్ధం చేశాను. నా శక్తి మేర అడ్డుపడ్డాను. రావణుడి రథాన్ని, సారధిని, ధ్వజాన్ని పడగొట్టాను. వాడిని నిగ్రహించలేకపోయాను. ఆకాశమార్గములో సీతమ్మని ఎత్తుకుపోతూ ధూళిని, మేఘాల్ని సృష్టి చేశాడు. ఖడ్గంతో నా రెక్కలని కోసేశాడు. నా కాళ్ళు నరికేశాడు. నేను ఏమి చెయ్యలేకపోయాను. రామా ! నేను చచ్చిపోయాను. ఇంకొక్కసారి నన్ను చంపకు " అన్నాడు.
జటాయువు మాటలు విన్న రాముడు ఆ కోదండముతో పరిగెత్తుకుంటూ వెళ్ళి జటాయువుని గట్టిగా కౌగలించుకుని ఏడిచాడు. ఆయన అలా ఏడుస్తున్నప్పుడు ఆ కోదండము చేతినుండి విడిపోయి కింద పడిపోయింది. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా జటాయువు మీద పడి ఏడిచాడు.
రాజ్యాద్భ్రంశో వనేవాసః సీతా నష్టా ద్విజో హతః |
ఈదృశీయం మమాలక్ష్మీః నిర్దహేదపి పావకమ్ ||
రాముడు " నాకు రాజ్యం పోయింది. అరణ్యానికి వచ్చాను. సీతని పోగొట్టుకున్నాను. నమ్మిన స్నేహితుడైన జటాయువు మరణిస్తున్నాడు. ఇవ్వాళ నేను పొందుతున్న శోకానికి అగ్నిని తీసుకొచ్చి అక్కడ పెడితే ఆ అగ్నిని నా శోకం కాల్చేస్తుంది. అంత శోకంలో నేను ఉన్నాను లక్ష్మణా! " అన్నాడు. " జటాయు! నాకోసం నువ్వు ఇంత కష్టపడ్డావు. ఒక్కసారి చెప్పు ఆ రావణుడు ఎక్కడ ఉంటాడు? అతని పౌరుష పరాక్రమాలు ఎటువంటివి? సీతని ఎటువైపుకి తీసుకెళ్ళాడు? ఏ రాజ్యాన్ని పరిపాలిస్తాడు? అతని స్వరూపము ఏమిటి? నాకు చెప్పు " అన్నాడు.
జటాయువు " ఆ రావణుడు సీతమ్మని అపహరించి సీతమ్మని తన ఒడిలో కూర్చోపెట్టుకుని, ఆకాశమార్గములో దక్షిణ దిక్కుకి తీసుకెళ్ళిపోయాడు. ఇంతకన్నా చెప్పాలని ఉన్నది. నా రెక్కలు తెగిపోవడము వలన నా కళ్ళు కనపడడము మానేశాయి. నా నోటి వెంట మాట రావడము లేదు. నువ్వు మాట్లాడుతున్నది వినపడడం లేదు. నాలో ఉన్న భావములను చెప్పగలుగుతున్నానో, చెప్పలేకపోతున్నానో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అన్నిటినీ మించి ఈ అరణ్యము అంతా నాకు బంగారముగా కనపడుతుంది. వింద అనే ముహూర్తంలో రావణుడు దొంగిలించాడు. నీ వస్తువు నీకు దొరుకుతుంది. ఆ ముహూర్తంలో దొంగలించబడ్డ వస్తువుని తిరిగి యజమాని పొందుతాడు. నువ్వు సీతమ్మని పొందుతావు. మీ ఇద్దరికీ పట్టాభిషేకము అవుతుంది. నువ్వు చాలా కాలము రాజ్యపాలన చేస్తావు " అని చెబుతుండగా ఆయన నోటినుండి రక్తంతో కూడిన మాంసం ముద్దని కక్కి తన చిట్టచివర ప్రాణాలని కూడా లాగి " రావణాసురుడి తండ్రి విశ్రవసో బ్రహ్మ. ఆయన తమ్ముడు కుబేరుడు....." అని చెప్పి శిరస్సు పక్కకి పడిపోగా ఆ జటాయువు మరణించాడు.
రాముడు " చూశావా లక్ష్మణా! రావణుడు సీతని బలవంతంగా అపహరించుకుపోతుంటే తన ప్రాణాలను అడ్డుపెట్టి ఈ పక్షి సీతని కాపాడే ప్రయత్నము చేసింది. మనం ఆలోచించి చూస్తే, ధర్మాన్ని పాటించేవారు, శూరులైనవారు, శరణాగతి చేసినవారిని రక్షించేవారు మనుష్యులలోనే కాదు, జంతువులలో కూడా ఉన్నారు. సీతని అపహరించారన్న సంగతి తెలుసుకున్నప్పుడు నేను పొందిన దుఖం కన్నా, ఒక పక్షి నాకు ఉపకారం చెయ్యడము కోసమని తన ప్రాణాలు వదిలేసిందని తెలుసుకొని నేను ఇవ్వాళ ఎక్కువ దుఖం పొందుతున్నాను. నాయనా లక్ష్మణా! దశరథ మహారాజు మనకి ఎలా గౌరవించ వలసినవాడో, ఆయనకి స్నేహితుడైన జటాయువు కూడా మనకి గౌరవించ వలసినవాడు. ఆనాడు నేను తండ్రిగారికి ఎలా అంత్యేష్టి సంస్కారము చేశానో జటాయువుకి ఇవ్వాళ అలా చెయ్యాలని అనుకుంటున్నాను.
లక్ష్మణా! అక్కడ ఏనుగులు చెట్లని ఒరుసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ చెట్ల యొక్క ఎండుకర్రలు కిందపడతాయి. నువ్వు వెళ్ళి ఆ కర్రలని పట్టుకురా. మనం ఈ జటాయువు శరీరాన్ని చితి మీద పెడదాము. ఆయన శరీరాన్ని అగ్నిలో కాల్చాక రోహి మాంసాన్ని పిండంగా పెడదాము " అన్నాడు. (రోహి అనేది ఒక మృగం పేరు జటాయువు మాంసం తింటాడు కనుక ఆయనకి ఆ మృగ మాంసంతో పిండం పెట్టారు).
జటాయువుకి పిండాలు పెట్టాక గోదావరినదికి వెళ్ళి ఉదకక్రియలు చేసి " నాచేత సంస్కరింపబడుతున్న ఓ జటాయువా! నేను నీకు అనుజ్ఞ ఇస్తున్నాను. నీకు ఇష్టము వచ్చిన ఉత్తమలోకాలకి వెళ్ళు" అని రాముడు అన్నాడు. తరువాత నదిలో జలతర్పణ చేశారు.
జటాయువు ఉత్తమలోకాలని పొందాడని వాల్మీకి మహర్షి చెప్పారు.
రామలక్ష్మణులు అక్కడినుంచి బయలుదేరి క్రౌంచారణ్యంలోకి ప్రవేశించారు. అతి భయంకరంగా ఉండే ఆ క్రౌంచారణ్యాన్ని రామలక్ష్మణులు దాటి కొంత దూరం వెళ్ళాక ఒక చీకటిగుహ కనబడింది. ఆ చీకటిగుహ దగ్గర అలికిడి చప్పుడు వినబడ్డాయి. అంతలోనే ఎక్కడినుంచో ఒక భయంకరమైన రాక్షస స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె పేరు అయోముఖి. కడుపు కిందకి జారిపోయి వికృతమైన రూపంతో ఉన్న ఆ అయోముఖికి లక్ష్మణుడి మీద వ్యామోహం పుట్టింది. అప్పుడామె పరుగు పరుగున వచ్చి లక్ష్మణుడిని పట్టుకొని " నువ్వు చాలా బాగున్నావు. మంచి యవ్వనంలో ఉన్నావు. మనిద్దరము ఈ పర్వాతాల మీద తిరుగుతూ క్రీడిద్దాము " అన్నది.
లక్ష్మణుడు వెంటనే తన ఖడ్గాన్ని తీసి ఆవిడ ముక్కుని, చెవులని, స్తనాలని నరికేశాడు. అయోముఖి నెత్తురు కారుతుండగా ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ ఆ గుహలోకి పారిపోయింది.
వారు అక్కడినుండి కొంతదూరం ప్రయాణించాక లక్ష్మణుడు రాముడితో ఇలా " అన్నయ్యా! చాలా దుర్నిమిత్తాలు కనపడుతున్నాయి. ఏదో తీవ్రమైన భయం వేస్తుంది. ఇక్కడ మంజులతం అనే పక్షి కూస్తోంది, ఈ పక్షి కూత ఎవరికి వినపడుతుందో వారికి జయం కలుగుతుంది. పరమ దారుణమైన యుద్ధం జరుగుతుంది" అని చెపుతుండగా ఒక పెద్ద శబ్దం వినపడింది. రామలక్ష్మణులు చూసేసరికి సృష్టిలో కనీ వినీ ఎరుగనటువంటి రూపం వాళ్ళకి కనపడింది. దానికి తలకాయ, కాళ్ళు లేవు. కేవలం గుండెల దగ్గరినుంచి నడుము కిందభాగం వరకు మాత్రమే దాని శరీరం ఉన్నది. అందులోనే ఒక పెద్ద నోరు, కన్ను ఉన్నాయి. ఆ కన్ను దూరంగా ఉన్న వస్తువులనికూడా చూస్తుంది. దానికి యోజనము పొడవున్న చేతులు ఉన్నాయి. అది నడవలేదు కనుక ఆ చేతులతో అడవిలో తడిమి దొరికిన దాన్ని తిని బతుకుతుంది. ఆ వింతస్వరూపాన్ని చూసి అసలు ఇదేమిటిరా ఇలా ఉన్నదని వాళ్ళు అనుకుంటున్నారు. ఇంతలోనే అది తన రెండు చేతులతో రామలక్ష్మణులను పట్టుకున్నది. అప్పుడది " నేను రాక్షసుడిని నన్ను కబంధుడని అంటారు. అరణ్యానికి వచ్చి ఇటువైపునకు ఎందుకు వచ్చారు? ఇప్పుడు నేను మీ ఇద్దరినీ తినేస్తాను " అని అంటూ వాళ్ళని దగ్గరిగా తీసుకునే ప్రయత్నంలో ఉండగా లక్ష్మణుడు రాముడితో " మనం వీడిని ఉపేక్షిస్తే వీడు మనిద్దరినీ మింగేస్తాడు. వీడి చేతులని ఖండించేద్దాము " అన్నాడు.
లక్ష్మణుడు ఎడమ బాహువుని, రాముడు కుడి బాహువుని నరికేశారు. కబంధుడు " మీరు ఇద్దరు ఎవరు? " అని అడిగాడు.
లక్ష్మణుడు " ఈయన రాముడు దశరరథుడి కుమారుడు. తండ్రి మాటకి కట్టుబడి పదునాలుగు సంవత్సరాలు అరణ్యవాసమునకు వచ్చాడు. ఈయన భార్య అయిన సీతమ్మని ఎవరో అపహరించారు. సీతమ్మని వెతుక్కుంటూ మేము ఈ మార్గంలో వచ్చాము. అసలు నువ్వు ఎవరు? నువ్వు ఇలా ఉన్నవేమిటి? నీలాంటి రాక్షసుడిని మేము ఎప్పుడూ చూడలేద" ని అన్నాడు.
కబంధుడు " నేను మీకు నా కథ చెబుతాను. కాని మీరు నాకు ఒక ఉపకారం చెయ్యాలి. ఒక చితి పేర్చి దానిమీద నన్ను పడుకోబెట్టి కాల్చెయ్యండి " అన్నాడు. " సరే నువ్వు కోరినట్టే నిన్ను కాల్చేస్తాము. సీతమ్మని ఎవరో రాక్షసుడు అపహరించాడు. నువ్వు రాక్షసుడివి కదా! నీకేమన్నా తెలుసా? " అని రామలక్ష్మణులు అడిగారు.
కబంధుడు " మీకు ఆ విషయాన్ని ఈ శరీరముతో చెప్పలేను. నన్ను కాల్చేస్తే, నాకు నా పూర్వ శరీరము వచ్చేస్తుంది. అప్పుడు ఆ శరీరముతో చెబుతాను. ఈ శరీరానికి అన్నీ జ్ఞాపకము లేవు. ఆ శరీరానికి అన్నీ తెలుసు. నన్ను కాల్చెయ్యండి " అన్నాడు.
" కాలుస్తాము కాని నువ్వు అసలు ఎవరు? ఇలా ఎందుకు ఉన్నావు?" అని రామలక్ష్మణులు అడిగారు.
కబంధుడు " పూర్వకాలంలో నేను ఎంతో గొప్ప తేజస్సుతో ఉండేవాడిని. నా పేరు ధనువు. సూర్యుడు ఎలా ఉంటాడో, చంద్రుడు ఎలా ఉంటాడో, ఇంద్రుడు ఎలా ఉంటాడో నాకూ అటువంటి శరీరము ఉండేది. నా స్వరూపాన్ని చూసి అందరూ పొంగిపోయేవారు. అందమైన శరీరంతో ఉన్న నాకు నేను కామరూపిని కనుక ఒక విచిత్రమైన స్వరూపాన్ని పొంది అరణ్యములోకి వెళ్ళి అందరినీ భయపెడితే ఎలా ఉంటుంది ' అని ఒక దిక్కుమాలిన ఆలోచన వచ్చింది. ' అప్పుడు నేను వెంటనే ఒక వికృతస్వరూపాన్ని పొంది అరణ్యములోకి వెళ్ళాను. అక్కడ స్థూలశిరుడు అనే మహర్షి దర్భలు ఏరుకుంటూ ఉండగా నేను ఆయన వెనకాలకి వెళ్ళి ఒక పెద్ద కేక వేశాను. అప్పుడా మహర్షి నా వంక చూసి ' ఇలా ఈ రూపంతో తిరగడము నీకు ఎంత సరదాగా ఉన్నదో, నువ్వు ఇలాగే చాలా కాలము ఇక్కడ తిరుగుతూ ఉండు' అని వెళ్ళిపోయారు. నేను నా నిజస్వరూపాన్ని పొంది ఆయన కాళ్ళ మీద పడి ' మీరు చెప్పిన మాట ప్రకారము నాకు ఆ భయంకరమైన స్వరూపము తొందరలో వస్తుంది. మళ్ళీ నాకు ఆ స్వరూపము ఎలా పోతుంది?' అని అడిగాను. అప్పుడా స్థూలశిర మహర్షి అన్నాడు ' నీకు వచ్చిన ఈ ప్రకోపము పోవాలి. కొంతకాలానికి ఇక్కడికి రామలక్ష్మణులు వచ్చి నీ రెండుచేతులు నరికేస్తారు. అప్పుడు నీకు శాపవిమోచనమవుతుంద' ని చెప్పారు.
నేను వెంటనే వెళ్ళి తపస్సు చెయ్యడము ప్రారంభించాను. కొంతకాలానికి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యి ' ఏమి కావాలి? ' అని అడిగారు. నేను ' నాకు దీర్ఘాయువు కావాలి ' అని అడిగాను. బ్రహ్మగారు తథాస్తని చెప్పి వెళ్ళిపోయారు. నాకు దీర్ఘాయుర్దాయము ఉన్నదన్న అహంకారముతో ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళాను. ఇంద్రుడు నూరు అంచులు ఉన్న వజ్రాయుధాన్ని నా మీద ప్రయోగించాడు. వజ్రాయుధం నా రెండు కాళ్ళని ఛాతిలోకి నొక్కేసింది. అలాగే నా తలని కూడా ఛాతిలోకి నొక్కేసింది. నా రెండుచేతులని కూడా లోపలికి నొక్కేసింది. నేను అప్పుడు నడుము నుంచి ఛాతి వరకూ ఉన్న శరీరముతో కిందపడ్డాను.
నేను ఇంద్రుడితో ' నువ్వు నన్ను కొట్టేశావు బాగానే ఉన్నది. నా చేతులు, కాళ్ళు లోపలికి తోసేశావు. నాకు బ్రహ్మగారు దీర్ఘ ఆయుర్దాయము ఉన్నదని వరమిచ్చారు. ఇప్పుడు నా నోరు లోపలికి వెళ్ళింది కదా! మరి నేను ఏమి తిని బతకను? ' అని ఇంద్రుడిని అడిగాను. ఇంద్రుడు నా కన్నుని, నోరుని నా ఉదరభాగము మీద ఏర్పాటు చేసి యోజనము పొడువున్న రెండు చేతులు ఇచ్చాడు.
రామా ! నేను అప్పటినుండి నేను ఇలా పడి ఉన్నాను. ఈ అరణ్యములో తడుముకుంటూ దొరికినది తింటూ ఉంటాను. ఎప్పటినుంచో రామలక్ష్మణులు దొరికితే బాగుండు అనుకుంటున్నాను. ఇప్పటికి మీరు దొరికారు. మీరు నా శరీరాన్ని కాల్చెయ్యండి నేను మీకు ఉపకారం చేస్తాను " అన్నాడు.
( మనకి ఉన్న ఒకే ఒక్క సుగుణమునుండి అహంకారం అనే భూతం వస్తుంది. ఒకడికి అందం ఉందని, ఒకడికి డబ్బు ఉందని, ఒకడికి అధికారం ఉందని, ఒకడికి చదువు ఉందని, ఒకడికి తెలివి ఉందని అహంకరిస్తుంటారు. మనకి ఉన్నదానిని పదిమందికి ఉపయోగపడే విధంగా బతుకుదామని ఉండదు. ఇదే కబంధుడి జీవితమునుంచి మనం నేర్చుకోవలసింది)
వాళ్ళు కబంధుడి శరీరాన్ని చితి మీద పెట్టి కాల్చేశారు. అప్పుడు ఆ చితి నుండి ఆభరణములు పెట్టుకుని, మంచి తేజస్సుతో, ఒక దివ్య శరీరముతో ధనువు పైకి వచ్చి " రామా ! ఇప్పుడు నీకు చాలా కష్టమైన కాలము నడుస్తుంది. నీలాగే భార్యని పోగొట్టుకుని బాధపడుతున్నవాడు ఒకడు ఉన్నాడు. ఆయన కూడా ధర్మాత్ముడు. ఆయన పేరు సుగ్రీవుడు. నలుగురు వానరములతో కలిసి ఋష్యమూక పర్వతము మీద ఉన్నాడు. ఆయనని అన్నగారైన వాలి రాజ్యం నుండి వెడలగొట్టాడు. ఋక్షరజస్సు అనే వానరుని భార్యకి సూర్యుడి తేజస్సు వల్ల సుగ్రీవుడు ఔరసపుత్రుడిగా జన్మించాడు. నువ్వు ఆయనతో అగ్నిసాక్షిగా స్నేహం చేసుకో. వానరుడు కదా అని ఎన్నడూ సుగ్రీవుడిని అవమానించద్దు. ఇప్పుడు నీకు ఒక గొప్ప మిత్రుడు కావాలి. సుగ్రీవుడు నీకు తగిన మిత్రుడు. ఆ సుగ్రీవుడిని కలుసుకోవడానికి నువ్వు ఇక్కడినుంచి పశ్చిమదిక్కుకి వెళ్ళు. అక్కడ అనేకమైన వృక్ష సమూహములు కనపడతాయి. ఆ వృక్షములకు ఉండే పళ్ళు సామాన్యమైనవి కావు. అవి చాలా మధురంగా ఉంటాయి. మీరు ఆ పళ్ళు తిని ముందుకి వెళితే కొన్ని వనములు వస్తాయి. మీరు ఆ వనములన్నీ దాటి ముందుకి వెళితే ఆఖరికి పంపా అనే పద్మసరస్సు వస్తుంది. ఆ సరస్సు దగ్గర హంసలు, ప్లవములు, క్రౌంచములు, కురరవములు అనే పక్షులు నేతిముద్దల్లా ఉంటాయి. మీరు ఆ పక్షులని చంపి వాటి మాంసాన్ని తినండి. అలా చెయ్యడము వల్ల మీరు సేద తీరుతారు. ఆ సరస్సులో రుచికరమైన చేపలు ఉంటాయి. మీరు వాటిని కూడా తినండి. సుగంధ భరితమై, నిర్మలమై, చల్లగా ఉండేటటువంటి ఆ సరస్సులోని నీటిని త్రాగండి. మీరు సాయంత్రము పూట అక్కడ విహరించండి. మీకొక విచిత్రమైన విషయము కనపడుతుంది. అక్కడ వాడని పూలదండలు పడి ఉంటాయి. ఆ పూలదండలని ఎవరూ వేసుకోరు.
రామా! ఈ పూలదండలు ఎలా వచ్చాయో తెలుసా ? పూర్వం మతంగమహర్షి ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆయనకి కావలసిన దర్భలు, ఇతర పదార్ధాలు అరణ్యమునుండి మూట కట్టి తీసుకెళ్ళేవారు. వారు అలా తీసుకెళుతున్నప్పుడు వారి ఒంటికి చెమట పట్టి, ఆ చెమట బిందువులు భూమిమీద పడ్డాయి. వారు ఎంతో గురు శుశ్రూష చేసినవారు. వాళ్ళ చెమటబిందువులు భూమిమీద పడగానే పూలదండలుగా మారిపోయాయి. ఆ పూలదండలు ఇప్పటికీ వాడకుండా అలానే ఉన్నాయి. నువ్వు ఆ పూలదండలని చూసి సంతోషించు. ఆ పంపాసరోవరానికి ముందరే ఋష్యమూక పర్వతము కనపడుతుంది.
ఆ ఋష్యమూక పర్వతాన్ని పూర్వకాలములో బ్రహ్మగారు నిర్మించారు. దానిని ఎక్కడము చాలా కష్టం. చిత్రమేమిటంటే ఆ పర్వతాన్ని గున్నఏనుగులు రక్షిస్తుంటాయి. ఆ గున్నఏనుగులు రోజూ పంపాసరోవరం దగ్గరికి గుంపులుగా వచ్చి నీళ్ళు త్రాగుతాయి. దాహం తీరిపోగానే పౌరుషము వచ్చి ఆ ఏనుగులన్నీ నోట్లోనుంచి నెత్తురు కారేటట్టుగా కొట్టుకుంటాయి. అంతగా కొట్టుకున్నాక అవి స్నేహితులు చెయ్యి చెయ్యి కలుపుకొని వెళ్ళినట్టు తొండాలు తొండాలు ముడివేసుకొని ఆ ఋష్యమూక పర్వతము చుట్టూ తిరుగుతాయి. ఆ ఋష్యమూక పర్వతశిఖరము మీద ఎవరన్నా ఒక రాత్రి పడుకుంటే ఆ రాత్రి వారికి కలలో ఏది కనపడుతుందో ఉదయానికల్లా అది జరిగి తీరుతుంది. పాపకర్మ, దుష్టబుద్ధి ఉన్నవాడు ఆ పర్వతాన్ని ఎక్కలేడు. ఆ పర్వతాల మీద ఐదు వానరాలు ఉన్నాయి. ఆ పర్వతము మీదకి వెళితే ఒక పెద్దగుహ ఉంటుంది. దానిని ఒక రాతి పలకతో మూసి ఉంచుతారు. ఆ గుహలోకి ఎవరూ ప్రవేశించలేరు. దాని పక్కనే ఒక పెద్దతోట ఉంటుంది. అందులో అన్ని ఫలాలు లభిస్తాయి. ఆ ఫలాలని తింటూ అక్కడే ఉన్న సరస్సులోని నీళ్ళు త్రాగుతూ సుగ్రీవుడు ఆ గుహలో కూర్చొని ఉంటాడు.
ఆ సుగ్రీవుడు అప్పుడప్పుడూ గుహనుండి బయటకి వచ్చి ఆ పర్వతశిఖరాల మీద ఒక పెద్ద బండరాయి మీద కూర్చుంటూ ఉంటాడు. గుర్తుపెట్టుకో రామా! ఆ సుగ్రీవుడికి సూర్యకిరణాలు ఎంత దూరమువరకూ భూమి మీద పడతాయో, అంతవరకు ఏ పర్వతాలు ఉన్నాయో, ఎన్ని గుహలు ఉన్నాయో, ఆ గుహలలో ఎవరు ఉంటారో, ఎవరు ఎక్కడ ఉంటారో, ఎక్కడ పాలిస్తారో, వారి వంశము ఏమిటో అన్నీ తెలుసు. అటువంటి సుగ్రీవుడితో స్నేహము చెయ్యి " అని చెప్పి వెళ్ళిపోయాడు.
రామలక్ష్మణులు బయలుదేరి మతంగమహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. మతంగమహర్షి యొక్క శిష్యురాలైన శబరి రామలక్ష్మణులను చూసి గబగబా బయటకి వచ్చి వారి పాదములను గట్టిగా పట్టుకుంది. వారికి అర్ఘ్యము, పాద్యము మొదలైనటువంటి అతిథికి ఇవ్వవలసిన సమస్త సంభారములు చేకూర్చింది. అవన్నీ స్వీకరించాక రాముడు శబరితో " నువ్వు నియమముగా జీవితము గడపగలుగుతున్నావా ! నియమముతో కూడిన ఆహారాన్ని తీసుకుంటున్నావా! తపస్సు చెయ్యగలుగుతున్నావా ! నీ గురువుల యొక్క అనుగ్రహాన్ని నిలబెట్టుకుంటున్నావా? " అని అడిగాడు.
శబరి " రామా ! ఏనాడు నీ దర్శనము చేశానో, ఆనాడే నా తపస్సు సిద్ధించింది. నేను కూడా మా గురువుగారైన మతంగమహర్షి శిష్యులతో పాటు తపస్సు చేశాను. నువ్వు చిత్రకూటపర్వతముమీద ఉండగా మా గురువులందరూ దివ్యమైన విమానములు ఎక్కి ఉత్తమలోకములకు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతూ నాతో ఒకమాట అన్నారు ' మహానుభావుడైన రామచంద్రమూర్తి ఈ ఆశ్రమము వైపుకి వస్తారు. వాళ్ళకి ఆతిధ్యము ఇచ్చాక నువ్వుకూడా మేము ఉన్నటువంటి ప్రదేశానికి రమ్మ ' ని చెప్పి వెళ్ళారు. నీకోసము నేను ఇక్కడే ఉండిపోయాన " ని చెప్పింది.
రాముడు శబరితో " నీ యొక్క ప్రభావాన్ని నేను చూడాలి అనుకుంటున్నాను శబరి " అన్నాడు.
శబరి రాముడిని ఆ ఆశ్రమము లోపలికి తీసుకువెళ్ళి ఒక అగ్నివేదిని చూపించి " రామా! మా గురువుగారు ఈ అగ్నివేది దగ్గరే అగ్నిహోత్రము చేసేవారు. వృద్ధులైన మా గురువులు వొణికిపోతున్న చేతులతో పువ్వులు తీసి ఆ వేదిమీద పెట్టేవారు. రామా! ఒక్కసారి ఆ వేదిమీద చూడు. ఆ పువ్వులు ఇప్పటికీ వాడకుండా అలానే ఉన్నాయి. నువ్వు చిత్రకూట పర్వతముమీద ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ అగ్నికార్యము చేసి వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఆ అగ్నివేదిలోనుంచి వచ్చే కాంతి దశదిశలని ప్రకాశింప చేస్తుంది. మా గురువులు చాలా వృద్ధులు అవ్వడము వలన నదీతీరానికి వెళ్ళి స్నానము చెయ్యలేకపోయేవారు. వారు అక్కడే కూర్చొని ఒక్క నమస్కారము చేసేవారు. వారు అలా నమస్కారము చెయ్యగానే ఏడు సముద్రముల యొక్క పాయలు ఇటుగా ప్రవహించాయి. మా గురువులు అందులో స్నానము చేసారు. మా గురువులు స్నానం చేసి తమ వస్త్రములను పిండి ఇక్కడే తీగలమీద ఆరవేసేవారు. నువ్వు ఆ వస్త్రములను ముట్టుకొని చూడు అవి ఇప్పటికీ అలానే తడిగా ఉంటాయి. వారు ముట్టుకున్న ప్రతి వస్తువుని వారు ఏ స్థితిలో ముట్టుకున్నారో అవి ఆ స్థితిలోనే ఉండిపోయాయి తప్ప ప్రకృతి యొక్క పరిణామగతంగా ఆ వస్తువులు మారలేదు. వారు అంతగా ఆత్మగతులై ఆత్మస్వరూపముగా ఉండిపోయారు.
రామా ! నీకోసమని చెప్పి నేను ఈ అరణ్యమునుండి చాలా సంభారములని సేకరించాను. నువ్వు వాటిని స్వీకరించ" ని చెప్పి, ఆ సంభారములని రాముడికి ఇచ్చి " మా గురువులు నీకు ఆతిధ్యము ఇవ్వమన్నారు నేను ఇచ్చాను. ఇంక నేను వెళ్ళిపోదామని అనుకుంటున్నాన " ని చెప్పి, సంకల్పమాత్రము చేత అగ్నిని రగిల్చి అందులో చీర క్రిష్ణాజీనాంబరములతో సహా దూకి తన శరీరాన్ని వదిలేసింది. ఆ అగ్నిలోనుంచి దివ్యమైన అంబరములతో, దివ్యమైన వస్త్రములతో ఆమె శరీరం బయటకి వచ్చి తన గురువులు ఉన్న లోకాలకి వెళ్ళిపోయింది.
ఆహా! ఏమి ఋషులు! ఏమి తపస్సు! అని రామలక్ష్మణులు పొంగిపోయి అక్కడినుండి బయలుదేరి ఋష్యమూక పర్వతము వైపు బయలుదేరారు.